చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖను బహిరంగపరచడంపై జగన్ పై చర్యలు తీసుకోవాలంటూ.. సుప్రీంకోర్టులో పిటిషన్!

13-10-2020 Tue 09:39
advertisement

సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై నిరాధారమైన ఆరోపణలు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ, నోయిడాకు చెందిన న్యాయవాది సునీల్ కుమార్ సింగ్, సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దేశ అత్యున్నత న్యాయస్థానంలో సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తిపై ఆరోపణలు చేయడంతో పాటు, వాటిని బహిర్గతం చేయడం ద్వారా ఆయన న్యాయస్థానాలపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేశారని ఆయన ఆరోపించారు. ఈ నెల 10న ఏపీ ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం మీడియా సమావేశాన్ని ఆయన ప్రస్తావిస్తూ, చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు జగన్ ఓ లేఖ రాశారని, అందులో మరో న్యాయమూర్తి, తదుపరి సీజేగా బాధ్యతలు స్వీకరిస్తారని భావిస్తున్న ఎన్వీ రమణపై పలు ఆరోపణలు చేశారని గుర్తు చేశారు.

తన చర్యల ద్వారా వైఎస్ జగన్ రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించారని, దేశపు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం ద్వారా అస్థిరపరచాలని చూస్తున్నారని పిటిషన్ దారు ఆరోపించారు. గతంతో పోలిస్తే, న్యాయస్థానాలపై ఆరోపణలు వస్తే, అవి ప్రజల్లోకి వేగంగా వెళుతున్నాయని, ఇది సమాజానికి చెడు సంకేతాలను పంపుతోందని అన్నారు. గంటల్లోనే ఈ తరహా వార్తలను మీడియా వైరల్ చేస్తోందని అన్నారు. ఆరోపణలు చేసిన సమయం కూడా అనుమానించతగినదేనని పిటిషన్ దారు అభిప్రాయపడ్డారు.

మాజీలు, ప్రస్తుత ప్రజాప్రతినిధులపై ఉన్న క్రిమినల్ కేసులను సాధ్యమైనంత త్వరగా విచారించాలన్న కేసును ఎన్వీ రమణ నేతృత్వంలోని బెంచ్ విచారిస్తున్న వేళ, ఈ ఆరోపణలు వచ్చాయని, అది కూడా ఓ రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి చేశారని గుర్తు చేస్తూ, ఆయనపైనా చాలా కేసులు పెండింగ్ లో ఉన్నాయని సునీల్ కుమార్ సింగ్ తెలియజేశారు.

కాగా, 2016లో మరో న్యాయవాది అశ్వని కుమార్ ఉపాధ్యాయ్ ఓ పిటిషన్ వేస్తూ, ప్రజా ప్రతినిధులపై ఉన్న కేసుల్లో త్వరితగతిన తీర్పులు ఇచ్చేలా చూడాలని కోరగా, ఆ కేసు విచారణ ఇప్పుడు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన ఎన్వీ రమణ, కేసుల సత్వర విచారణకు తీసుకోవాల్సిన చర్యలపై సలహాలు, సూచనలు ఇవ్వాలని అన్ని రాష్ట్రాల హైకోర్టులను ఆదేశించించిన సంగతి తెలిసిందే.

Do you hate fake news, misleading titles, cooked up stories and cheap analyses?.. We are here for YOU: Team ap7am.com
advertisement

More Flash News
advertisement
..more
advertisement