పోలీసులపై చంద్రబాబు వ్యాఖ్యలకు పోలీసు అధికారుల సంఘం కౌంటర్!
Advertisement
విశాఖలో పర్యటించాలని ప్రయత్నించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ కార్యకర్తలు అడ్డుతగలడం, ఆపై పోలీసులు ఆయన్ను ఎయిర్ పోర్టు లాంజ్ కు తరలించడం వంటి పరిణామాలు టీడీపీ నేతలకు విపరీతమైన ఆగ్రహాన్ని కలిగించాయి. దాంతో పోలీసులపైనా, వైసీపీ ప్రభుత్వంపైనా తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలో పరిణామాలతో చంద్రబాబు కూడా తీవ్ర అసహనానికి లోనయ్యారు. దీనిపై పోలీసు అధికారుల సంఘం స్పందించింది. పోలీసులు గాడిదలు కాస్తున్నారా? అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం తగదంటూ ఓ లేఖను విడుదల చేసింది.

సమాజంలో ఎప్పటికప్పుడు ఉత్పన్నమయ్యే పరిణామాలను బట్టి పోలీసులు అవసరానికి తగ్గట్టుగా స్పందిస్తుంటారని, ప్రజల భద్రతే పరమావధిగా విధులు నిర్వర్తిస్తుంటారని, ఈ సంగతి 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన వ్యక్తికి తెలియకపోవడం అత్యంత విచారకరం అని ఆ లేఖలో పేర్కొన్నారు. విశాఖలో ఆందోళనకారుల నుంచి మాజీ సీఎంకు ఎలాంటి ఆపద కలగకుండా కాపాడింది పోలీసులేనని, అలాంటి పోలీసులనే మీ అంతు చూస్తానంటూ మాజీ సీఎం హెచ్చరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వివరించారు.

చంద్రబాబు కుమారుడు లోకేశ్ సైతం బెదిరింపు స్వరం వినిపిస్తున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకుంటాం అనే తీరులో లోకేశ్ మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇకనైనా టీడీపీ నేతలు పోలీసుల పట్ల బెదిరింపులకు పాల్పడే ధోరణి విడనాడాలని హితవు పలికారు.
Fri, Feb 28, 2020, 04:23 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View