పాకిస్థాన్‌ కు పాకిన కరోనా వైరస్.. దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించిన పాక్ ప్రభుత్వం
Advertisement
చైనా, దక్షిణకొరియా, ఇరాన్, ఇటలీ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ పాకిస్థాన్ కు కూడా పాకింది. ఇస్లామాబాద్, కరాచీ నగరాల్లో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కరోనా కేసులను పాక్ వైద్య అధికారులు ధ్రువీకరించారు. ఇరాన్ నుంచి తిరిగి వచ్చిన ఇద్దరు వ్యక్తులకు చేసిన పరీక్షలో కరోనా పాజిటివ్ అని తేలిందని ప్రకటించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రత్యేక వైద్య పర్యవేక్షకుడైన డాక్టర్ జాఫర్ మీర్జా ఈ కేసులను నిర్ధారించారు.

ఈ సందర్భంగా డాక్టర్ మీర్జా మాట్లాడుతూ, 'పాకిస్థాన్ లో తొలి రెండు కరోనా కేసులను నేను నిర్ధారిస్తున్నా. వీరి విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి' అని తెలిపారు.

కరాచీకి చెందిన సయ్యద్ ముహమ్మద్ యహ్యా జాఫ్రీ (22), గిల్గిత్ బాల్టిస్థాన్ కు చెందిన మరో వ్యక్తి (50)కి కరోనా సోకింది. గత వారంలో ఇరాన్ నుంచి కరాచీకి విమానంలో జాఫ్రీ తిరిగొచ్చాడు. అతనికి శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు తలెత్తడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో, అతనితో పాటు అతని కుటుంబసభ్యులందరినీ దిగ్బంధించారు. జాఫ్రీతో పాటు విమానంలో కరాచీకి వచ్చిన ప్రయాణికులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఇద్దరు పౌరులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో పాక్ లో కలకలం మొదలైంది. దేశ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని పాకిస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. సింధ్, బలోచిస్తాన్ లో విద్యాలయాలన్నీ మూతపడ్డాయి. కరోనా కేసులు రెండు మాత్రమే బయటపడ్డాయని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ... ఈ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని ప్రజలు భయపడుతున్నారు. మరోవైపు, పాక్ లో మాస్కులు, ఇతర మందుల ధరలకు రెక్కలొచ్చాయి. వీటి ధరలను ఫార్మా కంపెనీలు, మెడికల్ స్టోర్లు అమాంతం పెంచేశాయి.
Thu, Feb 27, 2020, 04:29 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View