మళ్లీ డేవిడ్‌ వార్నర్‌‌కే సన్‌రైజర్స్‌ కెప్టెన్సీ!
Advertisement
ఆస్ట్రేలియా డ్యాషింగ్ క్రికెటర్‌‌ డేవిడ్ వార్నర్‌‌ ఐపీఎల్‌ జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్ సారథ్య బాధ్యతలు మరోసారి స్వీకరించనున్నాడు. తమ టీమ్‌ కెప్టెన్‌గా వార్నర్‌‌ను తిరిగి నియమిస్తున్నట్టు సన్‌రైజర్స్‌ ఫ్రాంచైజీ నేడు ప్రకటించింది. దాంతో, వచ్చే నెల 29న మొదలయ్యే పదమూడో సీజన్‌లో వార్నర్‌‌ రైజర్స్‌ను ముందుండి నడిపించనున్నాడు.

2015లో హైదరాబాద్ కెప్టెన్‌గా నియమితుడైన వార్నర్‌‌ తర్వాతి రెండు సీజన్లలో కూడా జట్టుకు నాయత్వం వహించాడు. 2016లో జట్టుకు ట్రోఫీ కూడా అందించాడు. అయితే, బాల్ ట్యాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న వార్నర్‌‌పై క్రికెట్ ఆస్ట్రేలియా నిషేధం విధించింది. దాంతో, అతను 2018లో జరిగిన 11వ సీజన్‌కు పూర్తిగా దూరమవగా.. కేన్‌ విలియమ్సన్‌కు సన్‌రైజర్స్‌ యాజమాన్యం సారథ్య బాధ్యతలు అప్పగించింది. గత సీజన్‌లో వార్నర్‌‌ రీఎంట్రీ ఇచ్చినప్పటికీ విలియమ్సన్‌నే కెప్టెన్‌గా కొనసాగించింది. అయితే, వచ్చే నెలలో మొదలయ్యే కొత్త సీజన్‌ కోసం కెప్టెన్సీలో మార్పు చేసిన ఫ్రాంచైజీ వార్నర్‌‌కు తిరిగి పగ్గాలు ఇచ్చింది.

జట్టుకు మరో ట్రోఫీ అందించేందుకు కృషి చేస్తా: వార్నర్‌‌

 తనకు మరోసారి కెప్టెన్సీ అప్పగించిన మేనేజ్‌మెంట్‌కు వార్నర్‌‌  కృతజ్ఞతలు తెలిపాడు. గత రెండు సీజన్లలో కేన్‌ విలియమ్సన్‌ జట్టును సమర్థవంతంగా నడిపించాడని కొనియాడాడు. జట్టును మరోసారి విజేతగా నిలిపేందుకు తన శక్తిమేరకు కృషి చేస్తానని ట్విట్టర్‌‌లో ఓ వీడియో సందేశం పోస్ట్‌ చేశాడు.  
Thu, Feb 27, 2020, 04:17 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View