ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కీలక పరిణామం.. ఆరుగురు అధికారులకు బెయిల్
Advertisement
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరుగురు అధికారులు.. నీతి ఆయోగ్‌ మాజీ సీఈఓ సింధు శ్రీ, మాజీ ఓఎస్‌డీ ప్రదీప్ కుమార్ బగ్గా, ఎఫ్‌ఐపీబీ మాజీ డైరెక్టర్ ప్రబోధ్ సక్సేనా, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఎఫ్‌పీబీ యూనిట్ మాజీ సెక్షన్ ఆఫీసర్ అజిత్ కుమార్ డండుంగ్, అప్పటి అండర్ సెక్రటరీ రవీంద్ర ప్రసాద్, మాజీ జాయింట్ సెక్రటరీ (ఫారిన్ ట్రేడ్) డీఈవో అనూప్ కె పూజారీలకు ఒక్కొక్కరికీ రూ. 2 లక్షల పూచీకత్తుపై ఢిల్లీ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న వీరు ప్రస్తుతం మధ్యంతర బెయిలుపై ఉన్నారు.

బెయిలు మంజూరు చేసిన కోర్టు.. తమ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లవద్దని, సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. కాగా, యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి కేంద్రమంత్రి చిదంబరం ఐఎన్ఎక్స్ మీడియా గ్రూపునకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక క్లియరెన్స్‌ల విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని అభియోగాలు నమోదయ్యాయి. మొత్తం రూ. 305 కోట్ల అవినీతి జరిగిందని సీబీఐ ఆరోపించింది. 15 మే 2017న తొలుత సీబీఐ కేసు నమోదు చేయగా, ఆ తర్వాత మనీలాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చిదంబరంతోపాటు ఆయన కుమారుడు కార్తి చిదంబరం కూడా విచారణ ఎదుర్కొంటున్నారు.
Wed, Feb 19, 2020, 06:12 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View