టీడీపీ నేతలు వైఎస్సార్ కంటివెలుగు పథకంలో పరీక్షలు చేయించుకోవాలి: లక్ష్మీపార్వతి
Advertisement
వైసీపీ మహిళా నేత, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి తాడేపల్లిలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై విమర్శనాస్త్రాలు సంధించారు. చంద్రబాబు బస్సు యాత్రలు చేయడం ఎందుకని ప్రశ్నించారు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళుతున్న సమయంలో రైతుల ఆత్మహత్యలు అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 340 మంది రైతులు చనిపోయారని ప్రచారం చేస్తున్నారని, చివరికి రాజధాని అమరావతిలో కూడా రైతులు చనిపోయారని అతి పెద్ద అబద్ధం చెబుతున్నారని విమర్శించారు.

"ఎందుకీ పాడు జీవితం! అబద్ధాలు చెబుతూ అందరితో ఛీ, ఛా అనిపించుకోవడం ఎందుకు? సింహంలా ఒక్కరోజు బతికినా చాలు... నక్కలా ప్రతిరోజూ అబద్ధాలతో బతకడం అవసరమా? చంద్రబాబు సమావేశాలకు ఎవరూ రావడంలేదు. తెలుగుదేశం వాళ్లే నాలుగు జెండాలు పట్టుకుని రోడ్లకు అడ్డంగా వాహనాలు పెట్టుకుని ఎంతోమంది వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఆయన సభలు జయప్రదం అయ్యాయని రాయడానికి ఓ పచ్చ మీడియా ఉంది. అది పచ్చ మీడియా కాదు పిచ్చిబట్టిన మీడియా. వేలంవెర్రిగా వచ్చారంట జనం! లక్షల్లో వచ్చేశారట! ఇలాంటి వార్తలు రాస్తున్నారు. ఓవైపు సీఎం జగన్ ఎంతో మంచి పథకాలు తీసుకువస్తున్నారు. నాకు తెలిసినంతవరకు టీడీపీ నేతలు ఓసారి వైఎస్సార్ కంటివెలుగు పథకంలో కంటి పరీక్షలు చేయించుకోవాలి. రాష్ట్రంలో వాస్తవాలు ఏంటో చూడొచ్చు" అంటూ హితవు పలికారు.
Wed, Feb 19, 2020, 05:39 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View