మహారాష్ట్రలో మళ్లీ గుర్రాలతో గస్తీ.. ప్రత్యేక దళం ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం
Advertisement

మహారాష్ట్ర  హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజాభద్రత, శాంతిభద్రతలు కాపాడేందుకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్రపు దళాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ వెల్లడించారు. ఈ దళంలో ఒక ఎస్ఐ, ఒక అసిస్టెంట్ పీఎస్ఐ, నలుగురు హవల్దార్లు, 32 మంది కానిస్టేబుళ్లు ఉంటారు. 

జనసమ్మర్థం, ట్రాఫిక్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో వాహనాలతో వెళ్లి గస్తీ కాయడం కంటే గుర్రాలపై వెళ్లడం సులువుగా ఉంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. ముఖ్యంగా పండుగలు, ప్రత్యేక రోజులు, ర్యాలీల సమయంలో గుర్రాలపై గస్తీ విధానం ఎంతో ఉపయోగంగా ఉంటుందని అనిల్ తెలిపారు.

గుర్రంపై విధులు నిర్వహించే ఒక సాయుధ పోలీసు నేలపై ఉన్న 30 మంది పోలీసులతో సమానమని, ఎత్తులో ఉండడం వల్ల నిఘా బాగుంటుందని ఆయన వివరించారు. పుణే, నాగపూర్ వంటి నగరాల్లో దీన్ని అమల్లోకి తెస్తామని, ప్రస్తుతం పోలీసు విభాగంలో 17 గుర్రాలు ఉన్నాయని వీటి సంఖ్య 30కి పెంచుతామని తెలిపారు. కాగా, రాష్ట్రంలో 1932కు ముందు అశ్వక దళం ఉండేది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో మళ్లీ 88 ఏళ్ల తర్వాత ఈ విధానం అమల్లోకి వస్తున్నట్టయింది.

Mon, Jan 20, 2020, 12:50 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View