సత్తా చాటిన టీమిండియా... బెంగళూరులో ఆసీస్ పై ఘనవిజయం
Advertisement
టీమిండియా సిసలైన ఆటతీరు ప్రదర్శించింది. బెంగళూరు వన్డేలో అన్ని రంగాల్లో రాణించి 7 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. ఆసీస్ విసిరిన 287 పరుగుల లక్ష్యాన్ని 47.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. చివర్లో మనీష్ పాండే అద్భుతమైన స్ట్రెయిట్ డ్రైవ్ తో విన్నింగ్ బౌండరీ సాధించాడు. శ్రేయాస్ అయ్యర్ 44 పరుగులతో అజేయంగా నిలిచాడు.

అంతకుముందు, ఓపెనర్ రోహిత్ శర్మ ఆట మ్యాచ్ కు హైలైట్ అని చెప్పాలి. 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 119 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత కెప్టెన్ కోహ్లీ తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో ఒత్తిడిని జయించి జట్టును విన్నింగ్ ట్రాక్ లో నిలబెట్టాడు. కోహ్లీ 89 పరుగులు చేసి హేజెల్ వుడ్ బౌలింగ్ బౌల్డయ్యాడు.

కాగా, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ మొదట బ్యాటింగ్ చేసి 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్ (131) సెంచరీ సాధించాడు. ఈ విజయంలో మూడు మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది.

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇటీవల ఐపీఎల్ వేలంలో అత్యధికంగా రూ.15.50 కోట్ల ధర పలికిన ఆసీస్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్ లో ఒక్క వికెట్ కూడా సాధించలేకపోయాడు. 7 ఓవర్లు విసిరిన కమిన్స్ 64 పరుగులు సమర్పించుకున్నాడు. స్టార్లతో నిండిన టీమిండియా లైనప్ పై కమిన్స్ ఎలాంటి ప్రభావం చూపలేకపోయాడు.
Sun, Jan 19, 2020, 09:20 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View