ఒక కొత్త రాజధాని అని మాత్రమే అన్నారు, రాజధానులు అనలేదు: రామానాయుడు
Advertisement
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో టీడీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం టీడీపీ నేత నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. తాము అభివృద్ధి వికేంద్రీకరణకు తప్ప పరిపాలన వికేంద్రీకరణకు మద్దతు పలకడంలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాలకు, జిల్లాల నుంచి మండలాలకు, మండలాల నుంచి పంచాయతీలకు అధికార పంపిణీ చేస్తే అది పరిపాలన వికేంద్రీకరణ అవుతుంది తప్ప, నాలుగు భవనాలు అమరావతిలో, నాలుగు భవనాలు విశాఖలో, మరో భవనం కర్నూలులో ఏర్పాటు చేస్తే అది పరిపాలన వికేంద్రీకరణ అనిపించుకోదని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో జరగాల్సింది అభివృద్ధి వికేంద్రీకరణ అని, టీడీపీ అలాంటి వికేంద్రీకరణకే మద్దతుగా నిలబడుతుందని వివరించారు. అమరావతి సంపద 13 జిల్లాలకు వెళ్లాలని, తద్వారా 13 జిల్లాలు అభివృద్ధి చెందాలన్నది తమ అభిమతమని చెప్పారు. విశాఖపట్నం ఇప్పటికే ఆర్థిక రాజధానిగా ఉందని, టెక్నాలజీ, సినీ, పారిశ్రామిక రాజధానిగా విశాఖ పేరుతెచ్చుకుందని రామానాయుడు వివరించారు. రాయలసీమలో కియా మోటార్స్ ఉందని, అలాంటి అభివృద్ధితో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలే తప్ప అమరావతిని మూడు ముక్కలు చేయడం వల్ల రాష్ట్రాభివృద్ధి జరగదు సరికదా, అటు ఉత్తరాంధ్ర, రాయలసీమకు కూడా ఎలాంటి మేలు జరగదని అన్నారు. తాము ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే వైఖరికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

విభజనచట్టంలో 'ఒకే కొత్త రాజధాని' అని మాత్రమే ఉందని, 'రాజధానులు' అని ఎక్కడా పేర్కొనలేదని వెల్లడించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందని, ఒకసారి సెటిలైపోయిన అమరావతి విషయాన్ని తిరగదోడే అధికారం ఈ ముఖ్యమంత్రికి లేదని తేల్చి చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోన్న ప్రజా బ్యాలెట్ లో అమరావతికే అనుకూలంగా ఓట్లు వేస్తున్నారని రామానాయుడు తెలిపారు. సీఎం జగన్ ఎన్నికల సమయంలో తన మేనిఫెస్టోలో ఎక్కడా అమరావతిని మార్చుతున్నట్టు చెప్పలేదని, మేనిఫెస్టో తనకు బైబిల్, భగవద్గీత, ఖురాన్ వంటిదని చెబుతున్న జగన్ ను, ఏ అధికారంలో రాజధాని మార్చుతారంటూ రేపు అసెంబ్లీలో నిలదీయబోతున్నామని పేర్కొన్నారు. రాజధానిని మార్చాలని భావిస్తే రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో రిఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
Sun, Jan 19, 2020, 07:02 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View