సుప్రీంకోర్టు ఆ మాట చెపితే.. రాష్ట్రాలు ఏమీ చేయలేవు: కపిల్ సిబాల్
Advertisement
పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కేరళ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబాల్ మాట్లాడుతూ, పార్లమెంటు చేసిన చట్టాలను తాము అనుసరించలేమని చెప్పడం ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా కష్టమేనని చెప్పారు. సీఏఏ, ఎన్నార్సీలు తమకు ఆమోదయోగ్యం కావని పలు రాష్ట్రాలు చెబుతున్నాయని అన్నారు. కానీ, ఎన్నార్సీ అనేది ఎన్పీఆర్ (జాతీయ పౌర జాబితా) మీద ఆధారపడి ఉంటుందని... దీన్ని రాష్ట్ర స్థాయి అధికారులు నియమించిన స్థానిక రిజిస్ట్రార్ చేస్తారని తెలిపారు. కేరళలోని కోజికోడ్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎన్నార్సీకి సహకరించబోమని చెప్పడమంటే... కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర అధికారులు సహకరించరని చెప్పడమేనని... ఇది అంత సులభమైన పని కాదని అన్నారు. రాజ్యాంగం ప్రకారం పార్లమెంటు చేసిన చట్టాలను రాష్ట్రాలు అనుసరించాల్సిందేనని... కాదని చెప్పడం సాధ్యమయ్యే పని కాదని చెప్పారు.

సీఏఏ అనేది జాతీయ అంశమని... దీన్ని జాతీయ స్థాయిలోనే ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని సిబాల్ అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోణంలో దీన్ని చూడరాదని... కాంగ్రెస్ నేతృత్వంలో అన్ని పార్టీలు కలిసి పోరాడాలని అన్నారు.

సీఏఏ అనేది రాజ్యాంగ విరుద్ధమని ఈ ఉదయం ఆయన మరో ట్వీట్ చేశారు. సీఏఏను విరమించుకోవాలంటూ తీర్మానం చేసే రాజ్యాంగబద్దమైన హక్కు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఉంటుందని చెప్పారు. సీఏఏ రాజ్యాంగబద్దమైనదేనని సుప్రీంకోర్టు చెబితే మాత్రం... దాన్ని వ్యతిరేకించడం అసాధ్యమవుతుందని అన్నారు.
Sun, Jan 19, 2020, 10:31 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View