జనసేన కార్యకర్తలపై వేధింపులు మానాలి: పవన్ కల్యాణ్
Advertisement
జనసేన కార్యకర్తలపై అక్రమంగా నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని ఆ పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పవన్ తాజాగా మీడియాకు ఓ ప్రకటనను విడుదల చేశారు. తాడేపల్లిగూడెంలో జనసేన నాయకులు  బొలిశెట్టి శ్రీనివాస్, మారిశెట్టి పవన్ బాలాజీలపై స్థానిక ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పోలీసులను ఆయుధంగా వాడుకుంటూ వేధింపులకు గురిచేయడాన్ని ఖండిస్తున్నట్లుగా పవన్ పేర్కొన్నారు.

మొన్న కాకినాడలో పోలీసులు ఇదేవిధంగా తమ కార్యకర్తలను వేధించారనీ, తాజాగా తాడేపల్లిగూడెంలో మళ్లీ అదే తీరు కనిపిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణపై పవన్ విమర్శలను గుప్పించారు. మా కార్యకర్తలు చేసిన తప్పేంటి? అని ప్రశ్నించారు. మారిశెట్టి పవన్ బాలాజీని బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తీసుకురావడమేకాక అక్రమంగా కేసు బనాయించడంకోసం ప్రజాప్రతినిధి అయివుండి దిగజారిపోతారా? అని ప్రశ్నించారు. మీరు చేసిన విమర్శలకు సమాధానం చెప్పడమే బాలాజీ చేసిన నేరమా? ఇళ్లకు పోలీసులను పంపి మహిళలను భయబ్రాంతులకు గురిచేస్తారా? అని నిలదీశారు.

ఈ అక్రమ అరెస్టును ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మాజీ మున్సిపల్ ఛైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ పై పోలీసులు వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమన్నారు. వైసీపీ ప్రతినిధులు తమ తీరు మార్చుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పవన్ బాలాజీపై పెట్టిన కేసును వెంటనే రద్దు చేయాలని పోలీస్ ఉన్నతాధికారులను కోరారు.
Sat, Jan 18, 2020, 06:30 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View