కేపీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ పేరు దాదాపు ఖరారు.. సిద్ధరామయ్య వర్గీయుల అసంతృప్తి
Advertisement
కర్ణాటక కాంగ్రెస్‌లో ముసలం మొదలైంది. డీకే శివకుమార్‌కు కేపీసీసీ అధ్యక్ష బాధ్యతలు దాదాపు ఖాయమని తేలడంతో సిద్ధరామయ్య వర్గంలో అసంతృప్తి మొదలైంది. మరోవైపు, శివకుమార్‌ను పీసీసీ చీఫ్‌గా ఏ క్షణమైనా అధిష్ఠానం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒకే ఎంపీ స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో పీసీసీ చీఫ్ గూండూరావును మార్చి కొత్త అధ్యక్షుడిని నియమించాలని నిర్ణయించారు. అయితే, అప్పటికే సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యాన్ని మూటగట్టుకోవడంతో గూండూరావు తన పదవికి రాజీనామా చేశారు. దీంతో నూతన అధ్యక్షుడి ఎన్నిక తప్పనిసరి అయింది.

మూడు రోజుల క్రితం ఢిల్లీ వెళ్లిన సిద్ధరామయ్య..సోనియాను కలిసి అధ్యక్ష పదవికి ఎంబీ పాటిల్ సరైన వ్యక్తని సూచించారు. అయితే, రాహుల్ గాంధీ మాత్రం డీకేవైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. మరోవైపు, సంకీర్ణ ప్రభుత్వం కూలడానికి సిద్ధరామయ్య కూడా కారణమని భావిస్తున్న సోనియా.. ఆయన ప్రతిపాదనను పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం అందులో భాగంగా శివకుమార్‌కే అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అదే జరిగితే సిద్ధరామయ్యకు పార్టీలో ప్రాధాన్యం తగ్గినట్టే అవుతుందని ఆయన వర్గీయులు అంటున్నారు. పరమేశ్వర్ సహా పలువురు సీనియర్‌లు కూడా సిద్ధరామయ్యను వ్యతిరేకిస్తున్నారు. వారందరూ కూడా డీకేకే మద్దతు తెలిపే అవకాశం ఉంది.
Sat, Jan 18, 2020, 11:59 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View