ఎన్టీఆర్ ఓ స్ఫూర్తి.. ఆయన లాంటి వ్యక్తి మరొకరు పుట్టరు: చంద్రబాబు
Advertisement
పేదల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడిన ఏకైక వ్యక్తి నందమూరి తారకరామారావు అని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ పేదల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారన్నారు. పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ఆయన అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు.

తెలుగు జాతి గుర్తుంచుకునే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అన్న చంద్రబాబు.. ఆయనలా నటించే వ్యక్తి మరొకరు పుట్టరన్నారు. ఎన్టీఆర్‌ను తలచుకోగానే స్ఫూర్తి వస్తుందన్నారు. రాయలసీమను ఆదుకున్న ఏకైక వ్యక్తి కూడా ఎన్టీయారేనని పేర్కొన్నారు. సమాజమే దేవాలయం, పేదలే దేవుళ్లని ఎన్టీఆర్ పదేపదే చెప్పేవారని, ఆయన స్ఫూర్తితో పనిచేయాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.

తాతగారి 24వ వర్ధంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో నివాళులర్పించినట్టు టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు. అనంతరం కార్యాలయంలో చంద్రబాబు రక్తదాన శిబిరాన్ని ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఆ మహనీయుడి (ఎన్టీఆర్) ఆశయసాధనే లక్ష్యంగా పనిచేస్తామని లోకేశ్ పేర్కొన్నారు.
Sat, Jan 18, 2020, 11:35 AM
Advertisement
Advertisement
2020-02-28T16:29:08+05:30
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View