కడపలో దారుణం.. వృద్ధుడిపై దాడిచేసి విలువైన వజ్రాన్ని దోచేసిన దుండగులు
Advertisement
ఓ వృద్ధుడి వద్ద విలువైన వజ్రం ఉందన్న విషయం తెలుసుకున్న దుండగులు అతడిపై దాడిచేసి దానిని దోచుకెళ్లారు. కడపలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణ శివారులోని చిలకలబావి వీధికి చెందిన ఖాదర్ బాషా (60) 2009లో చెన్నైలో 113 కేరట్ల బరువున్న వజ్రాన్ని రూ. 25 వేలకు కొనుగోలు చేశాడు. బాషాకు రత్నాల వ్యాపారి షాహీద్ హుస్సేన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

ఈ క్రమంలో బాషా వద్ద విలువైన వజ్రం ఉందని తెలుసుకున్న హుస్సేన్.. ఈ నెల 15న మరో వ్యక్తితో కలిసి కడప శివారులోని ఓ అద్దె ఇంట్లో దిగాడు. బాధిత బాషా 16వ తేదీన తన వద్ద ఉన్న వజ్రాన్ని హుస్సేన్‌కు చూపించేందుకు అతడి ఇంటికి తీసుకెళ్లాడు. దానిని చూసిన హుస్సేన్, అతడి స్నేహితుడు బాషాపై దాడిచేశారు. అతడి ముఖంపై పిడిగుద్దులు కురిపించారు. అనంతరం అతడి నుంచి వజ్రాన్ని లాక్కుని అతడిని మరింతగా కొట్టి వెళ్లిపోయారు.

కాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన బాషా తన వద్ద ఉన్న ఫోన్ ద్వారా కుమారులకు సమాచారం అందించాడు. వారొచ్చి అతడిని విడిపించారు. తీవ్రంగా గాయపడిన తండ్రిని రిమ్స్‌కు తరలించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Sat, Jan 18, 2020, 08:57 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View