ఏపీ కేబినెట్ మీటింగ్‌ నేడు కాదు.. సోమవారమే!
Advertisement
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మీటింగ్ విషయంలో గందరగోళం నెలకొంది. సమావేశాన్ని తొలుత ఈ నెల 20న నిర్వహించనున్నట్టు మూడు రోజుల క్రితమే మంత్రులకు సమాచారం అందింది. అయితే, శుక్రవారం మధ్యాహ్నానికి తన నిర్ణయాన్ని మార్చుకున్న ప్రభుత్వం శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు మీటింగ్ ఉంటుందని మంత్రులకు తెలియజేసింది. అయితే, రాత్రి కల్లా మళ్లీ ఈ నిర్ణయం మారిపోయింది. ముందుగా అనుకున్న ప్రకారమే సోమవారం ఉదయం 9 గంటలకే మీటింగ్ ఉంటుందని మళ్లీ మంత్రులకు సమాచారం అందించింది.

రాజధాని మార్పుకు సంబంధించి అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడానికి ముందు గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఉదయం 9 గంటలకు మంత్రి మండలి ఆమోదిస్తే, దానిని గవర్నర్‌కు పంపి అనుమతి తీసుకుని రెండు గంటల్లోపే అసెంబ్లీ సమావేశాలకు తీసుకురావడంలో హడావుడి ఏర్పడుతుందని ప్రభుత్వం భావించింది. అందుకనే తొలుత శనివారమే కేబినెట్ మీటింగ్ పెట్టాలని నిర్ణయించారు.

అయితే, బిల్లుపై పూర్తిస్థాయిలో చర్చించి, మంత్రి మండలిలో ప్రవేశపెట్టడానికి కొంత సమయం తీసుకోవాలని తాజాగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాబట్టి ఈ విషయంలో నిదానంగానే వ్యవహరించాలని ప్రభుత్వం భావించి మీటింగ్‌ను ముందుగా అనుకున్నట్టే సోమవారం ఉదయం 9 గంటలకు నిర్వహించాలని నిర్ణయించి, ఆ మేరకు మంత్రులకు సమాచారం పంపారు.
Sat, Jan 18, 2020, 08:10 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View