పోలీసు దుస్తుల్లో ప్రైవేటు వ్యక్తులున్నారు.. వారి జేబుల్లో బ్లేడ్లు ఉన్నాయి: నిర్మాత అశ్వనీదత్
Advertisement
తన జీవితంలో జైఆంధ్ర ఉద్యమం, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లాంటి ఉద్యమాలను చూశానని... కానీ, అమరావతి ఉద్యమాన్ని అణచివేస్తున్న దారుణమైన తీరును మాత్రం ఎన్నడూ చూడలేదని ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల తలలు పగిలేలా లాఠీలతో కొట్టారని చెప్పారు.

రాజధాని ప్రాంతంలోని మూడు గ్రామాల్లో ఈరోజు తాను పర్యటించానని తెలిపారు. ఒక్క ఇంట్లో ఒక మహిళ ఉంటే... ఇంటి బయట ఆ మహిళకు నలుగురు పోలీసులు కాపలాగా ఉన్నారని చెప్పారు. టెంట్లు వేసుకున్న రైతులను అక్కడి నుంచి వెళ్లగొట్టి... అక్కడ పోలీసులు కూర్చుంటున్నారని తెలిపారు. ఇన్ని టెంట్ల నిండా సరిపడేంత మంది పోలీసులు ఎక్కడ నుంచి వచ్చారని ప్రశ్నించారు. పోలీస్ దుస్తుల్లో ప్రైవేట్ వ్యక్తులను దించారని తెలిపారు. మహిళా పోలీసుల రూపంలో వచ్చినవారి జేబుల్లో బ్లేడ్లు ఉన్నాయని ఆడవాళ్లు చెబుతున్నారని అన్నారు.

మూడు రాజధానులకు మద్దతు పలికేవారికి ఏబీసీడీలు కూడా తెలియవని, ఎకానమీ గురించి తెలియదని అనుకోవాలని అశ్వనీదత్ చెప్పారు. రాయలసీమ నుంచి ముఖ్యమంత్రి జగన్ వచ్చారని... రాయలసీమ ఎక్కడుంది? విశాఖ ఎక్కడుంది? అని ప్రశ్నించారు. అమరావతికి గతంలో జగన్ కూడా అంగీకరించారని... 30 వేల ఎకరాలు కావాలని కూడా అన్నారని చెప్పారు. గొప్ప విజన్ ఉన్న చంద్రబాబును నమ్మి రైతులు స్వచ్ఛందంగా భూములు ఇచ్చారని అన్నారు.
Sat, Jan 11, 2020, 04:38 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View