చిరంజీవి, మహేశ్‌ బాబుతో దిగిన ఫొటో పోస్ట్ చేసి.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విజయశాంతి
Advertisement
మెగాస్టార్‌ చిరంజీవి, సూపర్‌స్టార్‌ మహేశ్ బాబుతో ఇటీవల తీసుకున్న ఫొటోను తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్ట్‌ చేసిన సినీనటి విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'నటనా పరమైన ప్రశంసల వల్ల లభించే సంతోషం ఒకటైతే... కమర్షియల్ సినిమాల విజయంతో సాధించే స్టార్‌డం ఇమేజ్ వల్ల అందుకునే ఆనందం ఇంకొకటి. ఈ రెండూ కళాకారులను అత్యంత ప్రభావితం చేయగలిగే అంశాలే అన్నది నా అభిప్రాయం' అని ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు.

'జాతీయ ఉత్తమ నటిగా నేను అవార్డు తీసుకున్న సందర్భంలో ఎంత గౌరవంగా భావించానో.. నటనకు డిక్షనరీ లాంటి మహానటుడు శివాజీ గణేషన్ గారు నన్ను "గ్రేట్ ఆర్టిస్ట్, నా దత్తపుత్రిక" అని సంబోధించినప్పుడు అంతకుమించి గౌరవంగా భావించాను. అలాగే కమర్షియల్ సినిమాల పరంగా ఎన్ని విజయాలు సాధించినా... లేడీ సూపర్‌స్టార్, లేడీ అమితాబ్ లాంటి అభినందనలు పొందినా... ఆ మాటను తెలుగు సినిమాను కమర్షియల్‌ పరంగా, కలెక్షన్ల పరంగా అత్యున్నత స్థాయికి తీసుకెళ్లిన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పడంతో ఆ పదాలకు ఒక విలువ, పదింతల మర్యాద లభించినట్లుగా భావిస్తున్నాను' అని విజయశాంతి పేర్కొన్నారు.

'సాధారణంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇలాంటి ప్రశంసలు అందుకోవడం ఆనవాయితీ. కానీ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఫంక్షన్ లోనే మెగాస్టార్ ద్వారా నేను అభినందనలు అందుకోవడానికి అవకాశం కల్పించిన సూపర్ స్టార్ మహేశ్‌ బాబు గారికి కృతజ్ఞతలు. "సరిలేరు నీకెవ్వరు" దర్శకుడు రావిపూడి గారితో పాటు... మొత్తం చిత్ర యూనిట్‌కు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను' అని విజయశాంతి పోస్ట్ చేశారు.
Wed, Jan 08, 2020, 11:17 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View