అమరావతి సమీపంలో టీడీపీ నేతలకు వేలకొలదీ ఎకరాలున్నాయి: ఏపీ మంత్రి బుగ్గన
- ఇప్పటివరకు 4070 ఎకరాలు తమ పేర రిజిస్టర్ చేసుకున్నారని ఆరోపణ
- హెరిటేజ్ కోసం 14.22 ఎకరాలు కొన్నారంటూ మండిపాటు
- స్థానికులే కాకుండా.. ఇతర ప్రాంతాల వారు ఈ పల్లెటూళ్లలో భూములు ఎందుకు కొన్నారు?

ఏపీ రాజధాని అమరావతిపై శాసనసభలో చర్చ సాగింది. ఈ నేపథ్యంలో బుగ్గన మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో రాజధాని పేర కొనసాగిన భూముల కొనుగోళ్లను ప్రస్తావించారు. రాష్ట్ర విభజన తర్వాత ఉద్యోగులు సమస్యలు ఎదుర్కొన్నారని మంత్రి బుగ్గన చెప్పారు. పక్కా ప్రణాళిక ప్రకారం.. రాజధానిని గుంటూరులో నిర్మించబోతున్నామని అప్పటి ప్రభుత్వం ప్రకటించిందన్నారు. దీంతో హైదరాబాదులోని వ్యాపారస్థులు గుంటూరు వద్ద భూములు కొనడం ప్రారంభించారని తెలిపారు. అనంతరం నూజివీడు అని అనడంతో వ్యాపారస్తులందరూ అక్కడా భూములు కొనడం ప్రారంభించారన్నారు.
ఇదంతా సాగుతున్న సమయంలో ఎవరికీ తెలియకుండా అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలు భూములు కొనడం మొదలుపెట్టారని ఆరోపించారు. జూన్ 1, 2014న ప్రభుత్వం ఏర్పాటు నుంచి ఏపీ రాజధాని అమరావతి అని ప్రకటన వెలువడే 31 డిసెంబర్ 2014 వరకు అంటే ఆరు నెలల నుంచి ఈ రోజు వరకు 4070 ఎకరాలు టీడీపీ నేతలు తమ పేరనే కాక తమకు కావాలసిన బంధువుల పేరన రిజిస్టర్ చేసుకున్నారన్నారు. హెరిటేజ్ కోసం 14.22 ఎకరాలు కొన్నారని పేర్కొన్నారు.




