ఆరుగురిపై పరువునష్టం దావా వేయబోతున్నాం: రామ్ గోపాల్ వర్మ
Advertisement
క్రైస్తవ మత బోధకుడు, ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పై సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సెటైర్లు వేశారు. ప్రపంచ యుద్ధాన్ని ఆపానని చెప్పుకుంటున్న పాల్... తన సినిమా 'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు'ను మాత్రం ఆపలేకపోయారని ఎద్దేవా చేశారు. తన సినిమా విడుదలకు ఆటంకాలు కలిగించిన ఆరుగురిపై పరువు నష్టం కేసులు పెడతామని ఆయన తెలిపారు. సినిమా విడుదలకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత కూడా... తన చిత్రంపై కొందరు ఆరోపణలు చేశారని... వీరి వెనుక ఎవరున్నారో తనకు తెలుసని చెప్పారు. వీరి వల్ల తన సినిమా విడుదల ఆలస్యమైందని మండిపడ్డారు.

తన చిత్రం కులాల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని... టైటిల్ అభ్యంతరకరంగా ఉందంటూ నమోదైన కేసులను కోర్టు కొట్టేసిందని వర్మ తెలిపారు. కేసులను కోర్టు కొట్టేసిన తర్వాత కూడా ఆరోపణలు చేయడం, విడుదలను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో తమకు నష్టం జరిగిందని చెప్పారు. ఎవరెవరైతే ఆటంకాలు కలిగించారో, డబ్బు తీసుకుని తమను ఇబ్బంది పెట్టారో వారిపై కేసులు వేయబోతున్నామని అన్నారు. వీరిలో ఇంద్రసేనా చౌదరి, కేఏ పాల్, సెన్సార్ అధికారిణి జ్యోతిలు కూడా ఉన్నారని చెప్పారు. వీరందరిపైనా రూ. 20 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు.
Mon, Dec 16, 2019, 11:37 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View