ఘటన ఎలా జరిగిందని ఎన్ హెచ్ ఆర్సీ అడిగింది: దిశ తండ్రి
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్ హెచ్ ఆర్సీ) నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో ఉండి వివరాలను సేకరించింది. ఈ నేపథ్యంలో దిశ తండ్రిని కూడా ఎన్ హెచ్ ఆర్సీ సభ్యులు కలుసుకుని వివరాలను నమోదు చేసుకున్నారు.  ఘటన ఎలా జరిగిందని కమిషన్ సభ్యులు అడిగారని ఆయన తెలిపారు.  ఈ విషయాలను ఆయన మీడియాతో పంచుకున్నారు.

'మా అమ్మాయి చనిపోయినప్పుడు ఎందుకు రాలేదని ఎన్ హెచ్ ఆర్సీ సభ్యులను మా కాలనీవాసులు నిలదీశారు. దిశ ఘటనను ప్రజలు తమ ఇంట్లో జరిగినదిగా భావించారు. సత్వర న్యాయం జరగాలని వారు కోరుకున్నారు. చనిపోయిన అమ్మాయి ఎలాగూ తిరిగిరాదు.. ఏమైనా మాకు పూర్తి న్యాయం జరగలేదు' అని దిశ తండ్రి మీడియాతో వాపోయారు.

తాము అడిగిన ప్రశ్నలకు ఎన్ హెచ్ ఆర్సీ సభ్యులు సమాధానం చెప్పలేకపోయారన్నారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో మరణశిక్ష పడితే హైకోర్టు రద్దు చేయొచ్చు.. లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశముంటుందని ఆయన తన అభిప్రాయాన్నివెల్లడించారు.

ముగిసిన ఎన్ హెచ్ ఆర్సీ విచారణ


దిశ హత్యాచార కేసులో నిందితుల ఎన్ కౌంటర్ పై జాతీయ మానవ హక్కుల కమిషన్ చేపట్టిన సమాచార సేకరణ ముగిసింది. ఈ నివేదికను ఎన్ హెచ్ ఆర్సీ రేపు సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. కాగా, రేపు సుప్రీంకోర్టులో దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై ప్రారంభం కానున్న విచారణకు సీపీ సజ్జనార్ స్వయంగా హాజరు కానున్నారు.
Tue, Dec 10, 2019, 07:53 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View