సిటిజెన్ షిప్ బిల్లుపై దేశ వ్యాప్తంగా నిరసనలు.. జంతర్ మంతర్ రోడ్డులో ఎంపీ బద్రుద్దీన్ అజ్మల్ ఆందోళన
Advertisement
జాతీయ పౌరసత్వ (సిటిజన్ షిప్) సవరణ బిల్లు-2019కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. సోమవారం లోక్ సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు బుధవారం రాజ్యసభలో చర్చకు రానుంది. అయితే ఈ బిల్లు దేశంలోని హిందువులు, ఇతర మతాలకు-ముస్లింలకు మధ్య ఉన్న ఐక్యతను దెబ్బతీసేలా ఉందని ఏఐడీయూఎఫ్ నేత, పార్లమెంట్ సభ్యుడు బద్రుద్ధీన్ అజ్మల్ అన్నారు. ఆయన నేతృత్వంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఈ రోజు ఆందోళన నిర్వహించారు.

ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్, ఆల్ ఇండియన్ డెమొక్రటిక్ ఫ్రంట్ తో పాటు పలు సంస్థలు ఢిల్లీలోని వివిధ ప్రాంతాలలో నిరసన ప్రదర్శనలు చేశాయి. ముస్లింలీగ్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. 1985 నాటి అస్సాం ఒప్పందంలోని నిబంధనలను కాలరాసేలా ఈ బిల్లు ఉందని అస్సాం వాసులు ఆందోళనకు దిగారు. గౌహతిలో దుకాణాలను బలవంతంగా మూయించి వేశారు.

మరోవైపు పశ్చిమ బెంగాల్, అగర్తలలో కూడా నిరసనలు హోరెత్తాయి. ఈ బిల్లు వల్ల పొరుగున ఉన్న పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి ముస్లిమేతరుల వలస భారీగా పెరుగుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నిరసన కారులు. ఇప్పటికే ఎన్నార్సీని అమలు పరిచిన అస్సాంలో 19 లక్షల మంది పేర్లను తొలగించినప్పటికీ, వారికి కోర్టులను అశ్రయించే అవకాశం కల్పించడం వల్ల పరిస్థితులు జటిలంగా మారిన సంగతి తెలిసిందే.
Tue, Dec 10, 2019, 06:35 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View