చొరబాటుదారులు, శరణార్థులు ఒక్కటి కాదు: అమిత్ షా
Advertisement
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్‌లలో మతపీడనకు గురై భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లుపై లోక్‌సభలో నిన్న వాడివేడి చర్చ జరిగింది. ప్రతిపక్షాలు ఈ బిల్లును ముక్తకంఠంతో వ్యతిరేకించినా అర్ధరాత్రి బిల్లుకు ఆమోదముద్ర పడింది. బిల్లుపై చర్చ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఈ సవరణ బిల్లుకు మొత్తం భారతీయుల మద్దతు ఉందన్నారు. ముస్లింలకు ఈ బిల్లు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బిల్లు ఎవరి హక్కుల్నీ హరించదని, ఈశాన్య రాష్ట్రాల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు.

చొరబాటుదారులను, శరణార్థులను వేర్వేరుగా చూడాల్సిన అవసరం ఉందన్నారు. మతపీడనను ఎదుర్కొని పై మూడు దేశాల నుంచి 31-12-2014 లోపు భారతదేశానికి వచ్చిన హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్శీలకు ప్రతిపాదిత చట్టం ద్వారా పౌరసత్వం కల్పిస్తామన్నారు. వారివద్ద రేషన్ కార్డులు, ఆధార్ వంటి పత్రాలు లేకపోయినా వారికి భారత పౌరసత్వం కల్పిస్తామన్నారు.

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, అద్వానీలు కూడా పాకిస్థాన్ నుంచి వచ్చినవారేనని ఈ సందర్భంగా అమిత్ షా గుర్తు చేశారు. అయితే, రాజ్యాంగంలోని ఆరో అధికరణలో చేర్చిన అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాలకు ప్రతిపాదిత చట్టం వర్తించదని అమిత్ షా స్పష్టం చేశారు. శరణార్థులుగా వచ్చి ఐదేళ్లుగా దేశంలో ఉంటున్న వారికి పౌరసత్వం లభిస్తుందని మంత్రి పేర్కొన్నారు.
Tue, Dec 10, 2019, 06:57 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View