రాజస్థాన్ లో ‘పానిపత్’ సినిమా ప్రదర్శన నిలిపివేత
Advertisement
చారిత్రక నేపథ్యంతో నిర్మించిన ‘పానిపత్’ చిత్రం వివాదాస్పదంగా మారింది. ఈ సినిమాపై హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ లో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాజస్థాన్ రాజధాని జైపూర్ నగరంలోని చాలా థియేటర్లలో ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేశారు. చిత్రంలో జాట్ వర్గీయులను తప్పుగా చిత్రీకరించారని ఆ వర్గం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రదర్శన నిలిపివేశామని థియేటర్ల యాజమాన్యం తెలిపింది.

 ‘మూడో పానిపత్ యుద్ధం’ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అర్జున్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమాకు అశుతోష్ గొవారికర్ నిర్మాత, దర్శకుడిగా బాధ్యతలు నిర్వహించారు. అర్జున్ కపూర్ సరసన కృతి సనన్ నటించగా, అఫ్గానిస్తాన్ సైన్యాధిపతి అహ్మద్ షా అబ్దాలి పాత్రలో సంజయ్ దత్ నటించారు. జాట్ మహారాజు సూరజ్ మల్ పాత్రను తప్పుగా చిత్రీకరించారని రాజస్థాన్ లోని జాట్లు ఆందోళన చేపట్టారు. దర్శకుడి దిష్టిబొమ్మలను కూడా దగ్ధం చేశారు.

సూరజ్ మాల్ కుటుంబంలో 14వ తరానికి చెందిన రాజస్థాన్ పర్యాటక శాఖ మంత్రి విశ్వేంద్ర సింగ్ కూడా ఈ సినిమాపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. పానిపత్ చిత్రంలో మహరాజా సూరజ్ మాల్ పాత్రను తప్పుగా చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమాపై నిషేధం విధిస్తారని తాను భావిస్తున్నట్లు మీడియాకు తెలిపారు. ఒక రాజ్యం లేదా గొప్ప వ్యక్తులకు సంబంధించి కథలను సినిమాగా తీసే ముందు సంబంధిత కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసుకునే విధంగా ఒక కమిటీ ఏర్పాటు చేస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Mon, Dec 09, 2019, 09:42 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View