‘హెరిటేజ్’లో ఉల్లిని ఎక్కువ ధరకు అమ్ముతున్నారు!: ఏపీ మంత్రి మోపిదేవి విమర్శ
Advertisement
ఏపీలో రైతు బజార్ల ద్వారా కిలో ఉల్లి రూ.25 కే ప్రజలకు అందిస్తుంటే, ఏవో ఘోరాలు నేరాలు జరిగిపోతున్నట్టు టీడీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ మండిపడ్డారు. ఏపీ సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మన పొరుగు రాష్ట్రాల్లోని ఏ ప్రభుత్వం సబ్సిడీ ధరలపై ఉల్లి పాయలను సరఫరా చేయట్లేదని అన్నారు. ఏపీ సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు కనుకనే కిలో ఉల్లి రూపాయలను రూ.25కే అందిస్తున్నట్టు చెప్పారు.

టీడీపీ సభ్యులు ఉల్లిపాయదండలు ధరించి అసెంబ్లీలో వచ్చేందుకు యత్నించారని విమర్శించారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఉల్లిపాయల ధరలు పెరిగినప్పుడు సబ్సిడీ ధరలపై ప్రజలకు అందించారా? అని ప్రశ్నించారు. ఒకవైపు రైతును, మరోవైపు వినియోగదారుడిని ఆదుకునేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుంటే టీడీపీ నేతలు విమర్శలు చేయడం కరెక్టు కాదని హితవు పలికారు.

ఉల్లిపాయలను అధిక ధరలకు విక్రయిస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శిస్తున్న పెద్దమనిషి చంద్రబాబునాయుడు, ‘హెరిటేజ్’లో కిలో ఉల్లిపాయల ధర రూ.135, ‘నీ సొంత వ్యాపార సంస్థల్లో ఇంత అధిక ధరలకు అమ్మాల్సిన పరిస్థితులు ఎందుకు ఉత్పన్నమయ్యాయి?’ అని ప్రశ్నించారు. కేవలం, ఉల్లిపాయ ధరలే కాదు ఇతర నిత్యావసరవస్తువుల ధరలు కూడా ’హెరిటేజ్’ లో ఎక్కువగా అమ్ముతున్నారని విమర్శించారు.  ‘ఈనాడు’లో ప్రచురించిన ఒక ఆర్టికల్ ఆధారంగా బయట దుకాణాల్లోని నిత్యావసరాల ధరలతో పోల్చి చూస్తే ‘హెరిటేజ్’ లో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారని అన్నారు.
Mon, Dec 09, 2019, 04:06 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View