ఆర్టీసీపై సీఎం కేసీఆర్ దృష్టి.. వజ్ర బస్సులు గూడ్స్ సేవలకు కేటాయింపు
Advertisement
సుధీర్ఘకాలం సాగిన ఆర్టీసీ సమ్మె సంస్థ మనుగడకు సంబంధించి అనేక సందేహాలను రేకెత్తించింది. ఒక దశలో ముఖ్యమంత్రి కేసీఆర్ అసలు ఆర్టీసీ అనేది ముగిసిపోయిన అధ్యాయం అని కూడా ప్రకటించారు. సీఎం మొండి పట్టుదల తెలిసిన అందరూ ఇక సంస్థ పని అయిపోయినట్టే అని భావించారు. బేషరతుగా తాము విధుల్లోకి వస్తామని కార్మికులు మెట్టు దిగడంతో సీఎం కేసీఆర్ సైతం మెత్త బడ్డారు. మొత్తానికి మళ్లీ పూర్తి స్థాయిలో బస్సులు రోడ్లెక్కడంతో అటు కార్మికులు, ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

సమ్మె విరమణ అనంతరం ఆర్టీసీ మనుగడపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. సంస్థ మనుగడ, లాభ, నష్టాలపై ఇటీవల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సౌకర్యార్ధం 2017 మేలో ప్రవేశపెట్టిన ‘వజ్ర’ బస్సులు మోసుకొస్తున్న నష్టాలు చర్చకు వచ్చాయి. కాలనీల్లోని ప్రజలకు అందుబాటులో ఉండడం, ఆక్యుపెన్సీ పరంగా ఉన్న ఇబ్బందులను అధిగమించడానికి ‘వజ్ర’ పేరుతో తొలుత 40 బస్సులను, అనంతరం మరో 20 మినీ ఏసీ బస్సులను ఆర్టీసీ ప్రవేశ పెట్టింది. అయితే సంస్థ ఆశించిన స్థాయిలో ఈ బస్సులు ప్రజలను ఆకట్టుకోలేక పోయాయి.

ప్రారంభంలో ఈ బస్సుల టిక్కెట్ లు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే దొరికేవి. దీనికి తోడు బస్సులు గమ్యస్థానం చేరే మార్గంలో ఉన్న ప్రధాన బస్ స్టేషన్స్ లోకి కూడా వెళ్లేవి కావు. మామూలు బస్సులతో పోలిస్తే సౌకర్యవంతంగా లేకపోవడం, చార్జీల విషయంలో గరుడ బస్సులకంటే అధికంగా ఉండడం వంటి కారణాలతో ప్రజల నుంచి వీటికి నిరాదరణ ఎదురైంది. ప్రారంభంలో రాజధాని నగరం నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రధాన పట్టణాలకు సర్వీసులు నడిపిన ఆర్టీసీ, ఆ తరువాత ఈ బస్సులను జిల్లాలలోని డిపోలకు పరిమితం చేసి చూసింది. అయినా ఫలితం శూన్యం.

తాజాగా వీటి వల్ల ఇప్పటికే 12 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రికి తెలిసింది. దీంతో ఈ బస్సులలోని సీట్లను తొలగించి వీటిని ఆర్టీసీ పార్సిల్ సర్వీస్ కు కేటాయించాలని సీఎం ఆదేశించారు. ఆర్టీసీ సరుకు రవాణా కాంట్రాక్ట్ ను గతంలో ANL సంస్థ నిర్వహించేది. ప్రస్తుతం ఆర్టీసీనే పార్సిల్ సర్వీన్ ను నిర్వహిస్తూ లాభాలను సంపాదిస్తోంది. ప్రజల నుంచి మంచి ఆదరణ ఉండడంతో, నష్టాలను చవిచూస్తున్న దాదాపు 1000 రూట్లకు చెందిన బస్సులతో పాటు ఈ వజ్ర బస్సులను కూడా సీట్లను తొలగించి గూడ్స్ రవాణాకు వాడుకోవాలని సీఎం నిర్ణయించారు. ఈ నిర్ణయంతో సంస్థకు ఆర్థిక నష్టాల నుంచి కొంత ఉపశమనం లభించనుంది.
Mon, Dec 09, 2019, 02:05 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View