మన మధ్య పార్టీ వైరమే...వ్యక్తిగతం కాదు!: వైసీపీకి అచ్చెన్న కౌంటర్
Advertisement

శీతాకాల అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఈ రోజు ఉదయం జరిగిన బీఏసీ సమావేశంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం జగన్, అచ్చెన్నాయుడు మధ్య జరిగిన సంభాషణలో చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి జోక్యం చేసుకోగా అంతే దీటుగా అచ్చెన్నాయుడు జవాబు ఇచ్చారు. వివరాల్లోకి వెళితే...అసెంబ్లీ సమావేశాల నిర్వహణ విధివిధానాలు రూపొందించేందుకు నిర్వహించిన బీఏసీ సమావేశానికి టీడీపీ శాసనసభాపక్షం ఉపనేత అచ్చెన్నాయుడు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఇటీవల విశాఖ జిల్లాలో ఆయనకు జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం ఆరా తీశారు. దీనికి అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తూ ఇప్పుడు అంతా బాగానే ఉందన్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి జోక్యం చేసుకుని 'చూశారా నాయుడూ...మా ముఖ్యమంత్రి గారికి మీరంటే ఎంత అభిమానమో' అంటూ వ్యాఖ్యానించారు.

దీనిపై స్పందించిన అచ్చెన్నాయుడు 'నాకు మాత్రం సీఎం అంటే కోపమా...ఆయనకూ, నాకూ వ్యక్తిగతంగా ఏమీ లేదు. ఆయన పార్టీ వేరు, మా పార్టీ వేరు, అంత వరకే విభేదాలు' అంటూ కౌంటర్ ఇచ్చి నవ్వులు పూయించారు. అసెంబ్లీ సమావేశాలు పదిహేను రోజులపాటు నిర్వహించాలని ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Mon, Dec 09, 2019, 12:48 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View