నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుకు తలారి కోసం వేట!
Advertisement
సంచలనం సృష్టించిన నిర్భయ దుర్ఘటనకు సంబంధించిన దోషులకు న్యాయస్థానం ఉరి శిక్ష విధించిన సంగతి తెలిసిందే. మొత్తం ఆరుగురు దోషులలో ఒకరు జైలులోనే ఆత్మహత్యకు పాల్పడగా, మరొకరు మైనర్ కావడంతో జువైనల్ కోర్టు అతనికి 3 సంవత్సరాల శిక్షను విధించింది. మిగిలిన నలుగురుకి ఉరిశిక్షను అమలు పరచాల్సి ఉంది. వీరిని ఉరి తీయడానికి తలారి కోసం జైళ్ళ శాఖ వెతుకులాట ప్రారంభించింది.

మన దేశంలో ఉరిశిక్షల విధింపు చాలా తక్కువగా ఉండటం వల్ల శాశ్వత తలారులను నియమించుకోలేదు. గడచిన 10 సంవత్సరాలలో కేవలం నలుగురికి మాత్రమే ఉరిశిక్షను అమలు పరచినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇక నిర్భయ దోషులలో ఒకరైన వినయ్ శర్మ క్షమాభిక్ష రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నందున వీరికి శిక్ష అమలు కాలేదనే వార్తలు ఇప్పటి వరకూ వినిపించాయి.

అయితే శుక్రవారం ఓ కార్యక్రమంలో అత్యాచార నిందితులకు క్షమాభిక్షను ప్రసాదించే అవకాశం లేదని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పేర్కొన్నారు. దీనికి తోడు క్షమాభిక్షను కోరినట్లు చెబుతున్న వినయ్ శర్మ సైతం తాను ఏ పిటిషన్ ను దాఖలు చేయలేదని శనివారం పేర్కొన్నాడు. ఈ రెండు పరిణామాలతో దోషుల ఉరికి మార్గం సుగమమయినట్లేనని భావించిన జైళ్లశాఖ వారి ఉరిశిక్ష అమలు కోసం తలారిని సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమైంది.
Mon, Dec 09, 2019, 12:40 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View