తమిళ రాజకీయాల్లో రజనీకాంత్ ఓ అద్భుతం అవుతారు: కేంద్ర మాజీ మంత్రి చిదంబరం
Advertisement

దక్షిణ భారత దేశంలోనే తనదైన ప్రత్యేకత సొంతం చేసుకున్న సినీనటుడు రజనీకాంత్ తమిళనాడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశిస్తే రాష్ట్రంలో అదో అద్భుతం అవుతుందని కేంద్ర మాజీ మంత్రి, మనీల్యాండరింగ్ కేసులో జైలుపాలై ఇటీవలే బెయిలుపై విడుదలైన పి.చిదంబరం వ్యాఖ్యానించారు. 

అయితే, రాజకీయాల్లోకి వచ్చాక రజనీకాంత్ మార్పులు తేగలరా? లేదా? అన్నది తాను చెప్పలేనని, ఆయననే అడగాలని సూచించారు. బెయిల్ పై బయటకు వచ్చాక నేరుగా పార్లమెంటు సమావేశాలకు హాజరైన చిదంబరం శనివారం సొంత రాష్ట్రం తమిళనాడుకు వచ్చారు. చెన్నైలో విడిది చేసిన ఆయన నిన్న తిరుచ్చి వెళ్లారు. అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలుకగా ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బెదిరించి, బ్లాక్ మెయిలింగ్ చేసి పాలన సాగిస్తోందని ధ్వజమెత్తారు. ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని, 30 కోట్ల మంది ప్రజలు పూట గడవని పరిస్థితుల్లో ఉన్నారని విమర్శించారు. రోజువారీ కూలీలు, పనులు చేసుకునే వారి పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. రిజర్వ్ బ్యాంకును కూడా బెదిరించి కోట్లు రాబట్టుకుని వాటిని కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసే పనిలో మోదీ ప్రభుత్వం ఉందని ధ్వజమెత్తారు.

జీఎస్టీ పేరుతో ప్రజల్ని దోచుకుని కార్పొరేట్ సంస్థలను పెంచి పోషిస్తున్నారని, ప్రస్తుతం జీఎస్టీ మొత్తం మరింత పెరిగే అవకాశం కూడా ఉందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ప్రజాస్వామ్య వాదుల గళాన్ని నొక్కి మోదీ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజలకు ప్రభుత్వం తీవ్ర ద్రోహం తలపెడుతోందని ఆరోపించారు.

Mon, Dec 09, 2019, 12:12 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View