నేటి నుంచి శాశ్వత భవనంలో మంగళగిరి ఎయిమ్స్ ఓపీ సేవలు
Advertisement
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఏపీకి కేంద్రం కేటాయించిన ప్రతిష్ఠాత్మక అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) మరో మెట్టు ఎక్కబోతోంది. ఇప్పటికే ఓపీ (ఔట్ పేషెంట్) సేవలను ఇక్కడ అందజేస్తున్నారు. ప్రస్తుతం ధర్మశాల పేరుతో నిర్మించిన భవనంలో తాత్కాలికంగా ఓపీ విభాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రధాన భవనంలో శాశ్వత ఓపీ విభాగం సిద్ధం కావడంతో సోమవారం నుంచి ఈ భవనంలోనే సేవలను అందిస్తారు.

ఇప్పటి వరకూ ఓపీ సేవల్లో భాగంగా 12 రకాలైన సాధారణ జబ్బులను పరిశీలిస్తున్నారు. నేటి నుంచి వీటికి అదనంగా పల్మనాలజీ, మెమోగ్రఫీ, పల్మనరీ మెడిసిన్, డిజిటల్ ఎక్స్ రే, పల్మనరీ మెడిసిన్, ట్రాన్స్ ఫ్యూజన్, మైనర్ చికిత్సలు, డేకేర్ సేవలు వంటి మరో 6 రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. 2020 అక్టోబర్ నెల నుంచి ఇన్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మంగళగిరి ఎయిమ్స్ కోసం కేంద్రం 1,618 కోట్ల రూపాయల బడ్జెట్ కోటాయించింది. ఇందులో 500 కోట్ల రూపాయలతో వివిధ భవనాలను నిర్మిస్తున్నారు. మందుల కోసం ఇదే ప్రాంగణంలో అమృత్ ఫార్మసీని నెలకొల్పారు. ఇక్కడ వివిధ రకాలైన జనరిక్ మందులు లభిస్తాయి. రవాణా పరంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఎయిమ్స్ కు ప్రజల నుంచి ఆదరణ పెరుగుతుండడం విశేషం.
Mon, Dec 09, 2019, 11:41 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View