తోపులాటలు...తొక్కిసలాటలు: విశాఖలో ఆగని ఉల్లి లొల్లి
Advertisement

రైతుబజార్ల వద్ద ఉల్లి లొల్లి మళ్లీ మొదలయ్యింది. సబ్సిడీ ఉల్లి అమ్మకాలకోసం తోపులాటలు, తొక్కిసలాటలు ఈ రోజు ఉదయం నుంచి మళ్లీ మొదలయ్యాయి. పక్షం రోజులపాటు విశాఖ నగరంలో కొనసాగిన ఉల్లిలొల్లికి నిన్న ఒక్కరోజే విశ్రాంతి. ఆదివారం సబ్సిడీ ఉల్లి అమ్మకాలు లేకపోవడంతో రైతు బజార్లు ప్రశాంతంగా కనిపించాయి. సోమవారం నుంచి మళ్లీ సేమ్ సీన్ ప్రారంభమయ్యింది. ఉల్లి ధర బహిరంగ మార్కెట్లో రూ.190లకు చేరడంతో ప్రభుత్వం రైతుబజార్ల ద్వారా రూ.25లకే ఉల్లి అమ్మకాలు చేస్తున్న విషయం తెలిసిందే.

దీంతో నగరంలోని 13 రైతుబజార్ల వద్ద ఒకటే రద్దీ. చాంతాడంత క్యూలు, తోపులాటలు, తొక్కిసలాటలు దర్శనమిచ్చాయి. తెల్లవారు జామున నాలుగు గంటలకే క్యూలో నిల్చోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పట్టింది. సబ్సిడీ ఉల్లికోసం భారీగా తరలివచ్చిన వారిని రైతు బజారు సిబ్బంది అదుపుచేయలేక పోలీసుల సహకారం కోరాల్సి వచ్చింది. దీంతో ఐదు రోజుల నుంచి పోలీసుల పహరా మధ్యే ఉల్లి అమ్మకాలు జరిపారు.

అయితే కొన్ని కుటుంబాల నుంచి ఇద్దరు ముగ్గురు వచ్చి క్యూలో రెండు మూడుసార్లు నిల్చుని ఉల్లి దక్కించుకుని తర్వాత బహిరంగ మార్కెట్లోను, హెూటళ్లకు అధిక ధరకు అమ్ముకుంటున్నారని, క్యూలో నిల్చున్న వారిలో 30 శాతం మంది కుటుంబ అవసరాల కోసం కాగా, మిగిలిన 70 శాతం మంది మారు వ్యాపారులే అన్న ఆరోపణలు కూడా వచ్చాయి.

ఈ నేపథ్యంలో ఆదివారం సెలవు కావడంతో పరిస్థితి సద్దుమణిగింది. సోమవారం నుంచి ప్రభుత్వం రెండు రకాల ఉల్లిపాయల అమ్మకాలు ప్రారంభించింది. కర్నూలు ఉల్లిని ఎప్పటిలాగే కిలో రూ.25లకు, మైదుకూరు కేపీ (కృష్ణాపురం) ఉల్లి కేజీ రూ.50లకు అమ్మకానికి ఉంచింది.

అయినప్పటికీ బహిరంగ మార్కెట్ ధరతో పోల్చితే ఈ ధర కూడా రెండు రెట్లు తక్కువగా ఉండడంతో రైతుబజార్ల వద్ద ఎప్పటిలాగే ఈ రోజు కూడా భారీ క్యూలు, తోపులాటలు మొదలయ్యాయి.

Mon, Dec 09, 2019, 10:52 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View