15 ఏళ్ల క్రితం తప్పిపోయిన అమ్మాయి ఫేస్ బుక్ సాయంతో కుటుంబాన్ని చేరింది!
Advertisement
హైదరాబాద్ లో 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ బాలిక ఇన్నాళ్లకు ఫేస్ బుక్ పుణ్యమా అని కన్నవారిని చేరుకుంది. అయితే పెంచిన తల్లి మమకారం ఆమెను వేదనలో ముంచెత్తింది. వివరాల్లోకెళితే.... భవాని అనే అమ్మాయి నాలుగున్నరేళ్ల వయసున్నప్పుడు తల్లిదండ్రుల నుంచి తప్పిపోయింది. తండ్రి మాధవరావు, తల్లి వరలక్ష్మి తమ బిడ్డ కోసం వెదకని చోటంటూ లేదు. కొన్నాళ్లు వెదికి తమకిక ప్రాప్తం లేదనుకున్నారు.

అయితే భవాని ఓ ఇంటివద్ద బిక్కుబిక్కుమంటూ ఉండగా జయరాణి అనే మహిళ గుర్తించి ఆ పాప సంబంధీకుల గురించి వాకబు చేసింది. ఎవరూ తమకు తెలియదనడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ పాపను తనతో పాటు తీసుకెళ్లింది. కొన్నాళ్లకు జయరాణి తన మకాం విజయవాడకు మార్చింది. భవానీని తానే పెంచి పెద్దచేసింది. అయితే జయరాణి విజయవాడలో వంశీ అనే వ్యక్తి ఇంట్లో పనిమనిషిగా చేస్తోంది. భవానీని కూడా అక్కడే పనిలో పెట్టేందుకు ప్రయత్నించగా, వంశీ ఆ బాలిక వివరాలేంటని అడిగారు.

దాంతో భవానీ చిన్నప్పుడు తనకు దొరికిన విషయాన్ని జయరాణి తెలిపింది. ఆ వివరాల ఆధారంగా వంశీ భవానీ కుటుంబ సభ్యుల కోసం ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. ఈ పోస్టు చూసిన భవానీ కుటుంబ సభ్యులు వీడియో కాల్ చేశారు. ఆ వీడియో కాల్ ద్వారా భవానీ తన సోదరుడ్ని గుర్తుపట్టింది. ఆమె తల్లిదండ్రుల ఆనందానికైతే అవధుల్లేవు. భవానీని తమ స్వస్థలానికి తీసుకెళ్లేందుకు ఆమె సోదరులు విజయవాడ వెళ్లారు.

అయితే, చిన్ననాటి నుంచి అన్నీతానై పెంచిన జయరాణిని వీడివెళ్లాల్సి రావడం భవానీని తీవ్ర భావోద్వేగాలకు గురిచేస్తోంది. ఓవైపు రక్తసంబంధం, మరోవైపు పెంచిన మమకారం మధ్య ఆ బాలిక నలిగిపోతోంది. కాగా, భవానీ తల్లిదండ్రుల స్వస్థలం శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లి గ్రామం.
Sat, Dec 07, 2019, 10:01 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View