దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై లోక్ సభలో చర్చ
Advertisement
ఈ రోజు లోక్ సభ లో దిశ అత్యాచారం, హత్య, ఉన్నావోలో అత్యాచారానికి గురైన బాధితురాలిపై చర్చ జరిగింది. బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి తెలంగాణలో పోలీసులు చేసిన ఎన్ కౌంటర్ ను పరోక్షంగా సమర్థించారు. ‘పోలీసులకు ఆయుధాలు ప్రదర్శన కోసం ఇవ్వలేదు. నిందితులు పారిపోతుంటే వాటిని ఉపయోగించాల్సిందే’ అని వ్యాఖ్యానించారు. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన సౌగతా రాయ్ మాట్లాడుతూ.. ఎన్ కౌంటర్ ను తాము స్వాగతిస్తున్నామని చెబుతూ.. ఇలాంటి భయంకరమైన ఘటనల్లో న్యాయ ప్రక్రియ వేగవంతం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.

ఇలాంటి ఘటనలను ఆపడానికి దేశవ్యాప్తంగా చర్చ చేపట్టాల్సిన అవసరముందని అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పాటిల్ చెప్పారు. ఈ తరహా నేరాల్లో నిందితులకు భయం లేకుండా పోయిందన్నారు. ఇటీవల ఉన్నావో అత్యాచార ఘటనలో బయటకు వచ్చిన నిందితులు బాధితురాలిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన విషయాన్ని ఎంపీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. నిర్భయ కేసులో ఇప్పటికీ శిక్ష పడని విషయాన్ని ఎత్తి చూపారు.  శివసేన ఎంపీ అరవింద్ సావంత్ చర్చలో పాల్గొంటూ.. న్యాయం వేగంగా, చట్టబద్ధంగా జరుగుతుందనే భరోసా ఉంటే ప్రజలు ఎన్ కౌంటర్ ను ఈ స్థాయిలో స్వాగతించాల్సిన అవసరం ఉండకపోయేదన్నారు.  

కాంగ్రెస్ లోక్ సభాపక్ష నేత అధీర్ రంజన్ చౌధరి మాట్లాడుతూ..ఓ వైపు రామమందిర నిర్మాణం గురించి మాట్లాడుతుంటే.. మరోవైపు మహిళలపై అత్యాచారాలు, హింస పెరిగిపోతున్నాయనడంతో.. మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. కొన్ని పార్టీలు ఇలాంటి సంఘటనలను రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నాయన్నారు. హైదరాబాద్, ఉన్నావో ఘటనలను తీవ్రంగా పరిగణించాల్సి ఉందంటూ.. వాటిని రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించకూడదని సూచించారు.
Fri, Dec 06, 2019, 09:55 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View