విశాఖలో ఉల్లి కోసం తోపులాట.. స్పృహ తప్పిన వినియోగదారులు
Advertisement
ఓ పక్క ఉల్లి ధరలు చుక్కలనంటుతుండటంతో ప్రజలు వాటి విక్రయ కేంద్రాల వద్ద పోటీపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తగ్గింపు ధరపై ఏపీ ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉల్లి కోసం విశాఖ ఏంవీపీ రైతు బజార్లో తోపులాట చోటుచేసుకుంది. ఈ రోజు తెల్లవారు జాము నుంచే  ఉల్లి కొనుగోలు కోసం విక్రయ కేంద్రం వద్ద భారీ సంఖ్యలో ప్రజలు క్యూ కట్టారు.

అధికారులు డిమాండ్ కు సరిపడా ఉల్లిని అందుబాటులో ఉంచకపోవడంతో ప్రజలు అక్కడి అధికారులతో వాగ్వాదానికి దిగారు. అధికారులు 2,100 కిలోల ఉల్లిని మాత్రమే సరఫరా చేశారు. ఇవి భారీ సంఖ్యలో వచ్చిన వినియోగ దారులకు ఏ మూలకు సరిపోలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని క్యూలైన్లను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో తోపులాట జరిగింది. పలువురు స్పృహ తప్పి పడిపోయారు. మహిళలను నియంత్రించడంలో పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. చాలామందికి ఉల్లి దక్కక ఉత్త చేతులతోనే వెనుదిరగాల్సి వచ్చింది.
Fri, Dec 06, 2019, 05:08 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View