ఇటలీ పార్లమెంటులో ఎంపీగారి ప్రపోజల్.. ఓకే చెప్పిన ప్రేయసి.. చప్పట్లు కొట్టిన సహచర ఎంపీలు!
- ‘విల్ యూ మ్యారీ మీ ఎలీసా’ అంటూ డైమండ్ రింగ్ ను చూపించిన ఎంపీ
- సంభ్రమానికి గురైనప్పటికీ.. అనంతరం ఓకే అన్న ఎలీసా
- శుభాకాంక్షలతో ముంచెత్తిన సహచర సభ్యులు

ఇటలీలో ఓ యువ పార్లమెంటేరియన్ ఏకంగా సభ నుంచే తన ప్రేయసికి పెళ్లి చేసుకుంటావా అని ప్రపోజ్ చేసి సంచలనం రేపారు. ఆయన ప్రపోజల్ ను ప్రేయసి అంగీకరించడంతో కథ సుఖాంతమైంది. సభ కార్యక్రమాలు టీవీలో ప్రత్యక్ష ప్రసారమవుతున్న సమయంలోనే ఇది జరిగింది. వివరాలలోకి వెళితే.. ఎంపీ డైమూరో తన దేశానికే చెందిన ఎలీసాను ప్రేమించారు. మూరో ప్రసంగాన్ని వినాలని ఎలీసా ఈ రోజు పార్లమెంట్ కు వచ్చి సందర్శకుల గ్యాలరీలో కూర్చున్నారు. ఆయన ప్రసంగాన్ని ఆమె శ్రద్ధగా వింటున్నారు.
ఈ నేపథ్యంలో అమెకు పెళ్లి విషయం ఎలా తెలుపుదామన్న సందిగ్ధంలో పడ్డ మూరో ఎట్టకేలకు ధైర్యం చేశారు. ‘విల్ యూ మ్యారీ మీ ఎలిసా’ అంటూ డైమండ్ రింగ్ ను చూపించారు. ఈ ప్రపోజల్ ను విన్న సహచర సభ్యులు ఆయనకు చప్పట్లతో అభినందనలు తెలిపారు. ముందు సిగ్గుపడ్డా.. అంతలోనే ఎలీసా నుంచి గ్రీన్ సిగ్నల్ అందుకున్న మూరో ఆనందంతో విషయాన్ని సహచర సభ్యులకు తెలపడంతో వారందరూ వచ్చి మూరో, ఎలీసాలకు శుభాకాంక్షలు తెలిపారు.



