అసమర్థ పాలన కారణంగా ప్రాజెక్టులు ఆగిపోయాయి: దేవినేని ఉమ మండిపాటు
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో  పోలవరం ప్రాజెక్టు పనులు నిలిచిపోవడానికి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అసమర్థ పాలనే కారణమని టీడీపీ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.

పోలవరంపై మాట్లాడటానికి మంత్రి పత్తాలేకుండా పోయారని, సీఎం జగన్ సమాధానం చెప్పడంలేదని మండిపడ్డారు. టీడీపీపై బురద జల్లేందుకు పనులు ఆపేసి తప్పుడు రిపోర్టు ఇచ్చారని దేవినేని ఉమ ఆరోపించారు. ఇష్టారాజ్యంగా కాంట్రాక్ట్ సంస్థలను మారిస్తే పోలవరం ప్రాజెక్టు భద్రత ఎవరిదని ఇప్పటికే పీఏసీ ప్రశ్నించిందన్నారు.

రాష్ట్రం ఖర్చు చేసిన డబ్బును కేంద్రం రీయింబర్స్‌ చేయడానికి.. జగన్‌ ప్రభుత్వం ఐదు నెలలుగా ఎందుకు ప్రయత్నించలేదని నిలదీశారు. పవర్‌ ప్రాజెక్ట్‌ కొట్టేయాలన్నదే జగన్ ఉద్దేశమని, పోలవరాన్ని 70 శాతం పూర్తి చేసిన నవయుగ కంపెనీని జగన్‌ కాదన్నారని ఆయన విమర్శించారు. బందరు పోర్టును నవయుగ కడుతుందని రద్దు చేశారన్నారు. ప్రజా ప్రయోజనాల పేరుతో అకారణంగా బందర్‌ పోర్టు రద్దు చేశారని ఆరోపించారు.

రాష్ట్రాన్ని ముంచడానికి మీకు అధికారం కావాలా? అని ప్రశ్నించారు. మునిగిపోతున్న జగన్‌ ప్రభుత్వాన్ని కాపాడటానికి ఏ ధర్మాడి సత్యం లేడన్నారు. 151 ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలను గెలిపిస్తే ఏం చేశారని ఆయన నిలదీశారు. కేంద్రం నుంచి నిధులు రాకపోవడం ఈ ప్రభుత్వ నిర్వాకం కాదా? అని అన్నారు. పోలవరంలో వేల కోట్ల అవినీతి జరిగిందని...జగన్ బంధువు పీటర్‌తో తప్పుడు నివేదిక ఇప్పించారని ఉమ ఆరోపించారు.
Tue, Nov 19, 2019, 05:39 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View