అక్కినేనిని చూసి కేంద్ర ఆరోగ్యమంత్రి నమ్మలేకపోయారు: చిరంజీవి
Advertisement
అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి అక్కినేనితో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సుబ్బరామిరెడ్డిగారి పరమేశ్వరి థియేటర్స్ ఆధునికీకరించిన అనంతరం పునఃప్రారంభిస్తూ తనను, అక్కినేని నాగేశ్వరరావు గారిని కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించారని, ఆ కార్యక్రమానికి తనతోపాటు అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రి గులాంనబీ ఆజాద్ ను కూడా పిలిచారని వెల్లడించారు.

"అయితే అక్కినేని గారిని గులాంనబీ ఆజాద్ వెంటనే గుర్తుపట్టలేకపోయారు. నేను చెబితే అరే అనుకుని తలకొట్టుకుని, బయట ఆయనను ఎప్పుడూ చూడలేదు ,అందుకే వెంటనే గుర్తుపట్టలేకపోయానని బాధపడ్డారు. అయితే అక్కినేని వయసు ఎంత అని అడిగితే నేను 90 ఏళ్లు అని చెప్పాను. దాంతో ఆయన నమ్మలేకపోయారు. ఈ వయసులో ఇంత యాక్టివ్ గా ఎలా ఉన్నారు? నేను ఆరోగ్య శాఖ మంత్రిగా అడుగుతున్నాను, ఆయన ఆరోగ్య రహస్యం ఏంటో తెలుసుకోండి! మా మంత్రిత్వ శాఖలో అమలు చేసేలా చర్యలు తీసుకుంటాను అని అడిగారు" అని చిరు వెల్లడించారు.

నాగేశ్వరరావు గారి ఆరోగ్యానికి మానసిక దృఢత్వమే కారణమని స్పష్టం చేశారు. మరో కార్యక్రమంలో, మెట్లు ఎక్కే సమయంలో తాను చేయి అందిస్తే ఓ చూపు చూశారని వెల్లడించారు. ఏం నేను ఎక్కలేననుకున్నావా అంటూ చేయి అందుకోకుండానే చకచకా మెట్లేక్కేశారని వివరించారు. ఆయన చివరి రోజుల్లో తాను వెళ్లి పలకరిస్తే ఎంతో సంతోషపడిపోయేవారని, మీరొస్తే నాన్న గారు చాలా రిలీఫ్ ఫీలవుతున్నారండీ అని ఏఎన్నార్ కుమార్తె సుశీల చెప్పేవారని చిరంజీవి గుర్తుచేసుకున్నారు.
Sun, Nov 17, 2019, 07:25 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View