నిజమైన బయోపిక్ అంటే జార్జిరెడ్డి సినిమానే!: సీనియర్ నటుడు నాగబాబు ప్రశంసలు
Advertisement
ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జార్జిరెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన చిత్రం ట్రైలర్ ను చూసి ప్రముఖ నటులు తమ స్పందన వ్యక్తం చేస్తున్నారు. ‘జార్జిరెడ్డి’ పేర విడుదల అవుతున్న ఈ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని చెబుతున్నారు. సీనియర్ నటుడు నాగబాబు ట్రైలర్ ను చూసి ఈ చిత్ర బృందాన్ని అభినందిస్తూ తన ఛానెల్ లో పేర్కొన్న సందేశానికి సంబంధించిన వీడియోను యూ ట్యూబ్ లో పోస్ట్ చేశారు.

‘నేను జార్జిరెడ్డి పోస్టర్లు చూసిన తర్వాత ట్రైలర్ ను చూశా. జార్జిరెడ్డి ఉస్మానియా విద్యార్థి అన్న విషయం తెలుసు. చాలా ఏళ్లుగా ఆయన గురించి వింటూనే ఉన్నా. అతని పాత్రను మా కల్యాణ్ బాబు లేదా మా అబ్బాయి వరుణ్ తో చేయిస్తే ఎలా ఉంటుందని ఆలోచించా. ఈలోగా జీవన్ రెడ్డి ఆ కథతో సినిమా తీసేశారని సంతోషించా. ట్రైలర్ చూసిన తర్వాత అలాంటి పాత్రకు పేరున్న నటుడు అంతగా సరిపోడని నాకు అనిపించింది.

సందీప్ మాధవ్ ఇప్పటివరకు చిన్న పాత్రలే చేశాడు. అతను జార్జిరెడ్డి పాత్రకు సరిపోయాడు. జార్జిరెడ్డి ఒక దిగ్గజ విద్యార్థి. అందుకే ఆయనంటే నాకు ఇష్టం. ఫిజిక్స్ లో అతను గోల్డ్ మెడలిస్ట్. ఇస్రోలో ఉద్యోగం వస్తే చేరలేదట. విద్యార్థుల సమస్యల పరిష్కారంకోసం ఆయన వాటిని వదులుకున్నాడు’ అని చెప్పారు.

జార్జి రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే అంటూ.. ఆయన మేధావి మాత్రమే కాదు, రియల్ హీరో, రియల్ లైఫ్ బాక్సర్. అనేక విద్యల్లో ప్రావీణ్యం ఉందని నాగబాబు అన్నారు. లెజండరీ స్టూడెంట్ గురించి అందరికీ తెలియాలనే తన ఛానెల్ ద్వారా ఈ విషయాలను పంచుకుంటాన్నానని చెప్పారు. 25 కత్తిపోట్లు తిని కూడా ప్రాణాలు దక్కించుకుని, మళ్లీ సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి  జార్జిరెడ్డని, అటువంటి వ్యక్తిని కొన్ని శక్తులు మట్టుబెట్టాయని వ్యాఖ్యానించారు.

జార్జిరెడ్డి ఫొటోలను చూస్తుంటే మా పవనే గుర్తుకొస్తాడని, ఆయన వ్యక్తిత్వం, భావోద్వేగాలు పవన్ లో కనిపిస్తాయన్నారు. జార్జిరెడ్డి జెండాలో పిడికిలి గుర్తు, జనసేన జెండాలో ఉండటం యాదృచ్ఛికమన్నారు. ఇప్పటివరకు చాలా బయోపిక్ లు వచ్చాయి. అసలు బయోపిక్ అంటే ఇది అని పేర్కొన్నారు. సందీప్ మాధవ్, సత్యదేవ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. 22న ఈ చిత్రం విడుదల కానుంది.
Tue, Nov 12, 2019, 06:24 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View