జగన్ గారూ పద్ధతిగా మాట్లాడండి.. ఓ స్థాయి వరకే చూస్తాను: పవన్ కల్యాణ్ హెచ్చరిక
Advertisement
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. సీఎం మాటలు చూస్తుంటే వంటికి టెన్ థౌజండ్ వాలా టపాసులు చుట్టుకుని, మిగతా 150 మంది ఎమ్మెల్యేలందరికీ కూడా టెన్ థౌజండ్ వాలా టపాసులు చుట్టి పేల్చుతున్నట్టుగా ఉందని, ఇది అందరికీ ప్రమాదకరం అని వ్యాఖ్యానించారు. అందరూ కాలిపోతారు జాగ్రత్త అని హెచ్చరించారు.

జగన్ గారూ ఎలా పడితే అలా మాట్లాడొద్దు, పద్ధతిగా మాట్లాడితే మంచిదని అన్నారు. జగన్ ను చూసుకుని వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాము శివుడి మెడలో ఉన్నంత వరకే గౌరవం అని, ఒక్కసారి జగన్ రెడ్డి పరిస్థితి తారుమారైతే మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి అని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందే భాషా ప్రయుక్త ప్రాతిపదికన అని, ఆ విషయం మీరు చరిత్రలో చదువుకున్నారా? లేదా? అని జగన్ ను ప్రశ్నించారు.

"నేనెప్పుడూ మీ వ్యక్తిగతంపై మాట్లాడలేదు. మిమ్మల్నే కాదు మీ ఎమ్మెల్యేలపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. కానీ ఓ స్థాయి దాటిందంటే మిమ్మల్ని కూడా ఎలా మాట్లాడాలో చాలా బలంగా తెలిసినవాడ్ని. అయితే సంయమనం పాటిస్తున్నాను" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, తనపై జగన్ చేసిన మూడు పెళ్లిళ్లు, పిల్లల వ్యాఖ్యలను కూడా ప్రస్తావించారు. "ఏం జగన్ రెడ్డి గారూ, నేను చేసుకున్న మూడు పెళ్లిళ్ల కారణంగానే మీరు, విజయసాయిరెడ్డిగారూ కలిసి రెండు సంవత్సరాలు జైల్లో కూర్చున్నారా? అడిగిన దానికి సరిగా స్పందించకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడొద్దు" అంటూ హెచ్చరించారు.
Tue, Nov 12, 2019, 04:33 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View