ఆయనకు స్వప్రయోజనాలే ముఖ్యం... ఇన్ఫోసిస్ సీఈఓపై మరో ఆరోపణల లేఖ!
Advertisement
టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈఓ సలిల్ పరేఖ్ పై మరోసారి ఆరోపణలు వచ్చాయి. సెప్టెంబర్ 20వ తేదీన బోర్డుకు ఓ లేఖ అందగా, అది భారత కార్పొరేట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. సంస్థలో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఆదాయాన్ని ఎక్కువగా చేసి చూపిస్తున్నారని అప్పట్లో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఇన్ఫీలో అంతర్గత విచారణ జరుగుతూ ఉండగా, సెబీ సైతం విచారణ ప్రారంభించింది.

ఇక తాజాగా, పేరును వెల్లడించకుండా మరో విజిల్ బ్లోయర్ సంచలన ఆరోపణలు చేస్తూ, సలిల్ పై చర్యలు తీసుకోవాలని చైర్మన్‌ నందన్ నీలేకని, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ను ఉద్దేశించి లేఖ రాశాడు. తాను ఫైనాన్స్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగినని చెప్పుకున్న అతను, తన పేరును బహిర్గతం చేస్తే, ప్రతీకారం తీర్చుకుంటారన్న భయం ఉందని చెప్పాడు. సలిల్ పరేఖ్, కంపెనీలో చేరి 8 నెలలు గడుస్తున్నా, బెంగళూరుకు నివాసాన్ని మార్చలేదని, ఇది నిబంధనలకు విరుద్ధమని ఆరోపించాడు. సంస్థ విలువను, వ్యవస్థలను క్షీణింపజేసేలా ఆయన చర్యలు ఉన్నందునే, కొన్ని వాస్తవాలను బోర్డు దృష్టికి తేవడాన్ని తన కర్తవ్యంగా భావించానని తెలిపాడు.

కేవలం తన వ్యాపార ప్రయోజనాలు మాత్రమే సలిల్ పరేఖ్ కు ముఖ్యమని, అందుకే ఆయన ముంబైలోనే మకాం వేసున్నారని ఆరోపిస్తూ, ఆయనకు స్టాక్ మార్కెట్ సంబంధాలున్నాయని, ఎన్నో కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారని ఆరోపించాడు. ఆయన్ను చూసి చాలా మంది సంస్థ ఉన్నత ఉద్యోగులు కార్యాలయానికి రావడం మానేశారని తన లేఖలో పేర్కొన్నాడు. నెలకు రెండు సార్లు ఆఫీసుకు వచ్చి వెళ్లేందుకు ఫ్లయిట్ చార్జీలు, ఇతర రవాణా నిమిత్తం ఆయన రూ. 22 లక్షలు తీసుకున్నారని ఆరోపించాడు. కాగా, ఈ తాజా ఆరోపణలపై ఇన్ఫోసిస్ ఇంకా స్పందించలేదు.
Tue, Nov 12, 2019, 12:13 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View