ధైర్యంతో ముందుకెళ్లేవాడు ఎన్నటికీ ఓడిపోడు: ఆసుపత్రి నుంచే ట్వీట్ చేసిన సంజయ్ రౌత్
Advertisement
శివసేన కీలక నేత, ఆ పార్టీ అధికార పత్రిక సామ్నా ఎడిటర్ అయిన సంజయ్ రౌత్ అనారోగ్యంతో ఉన్నప్పటికీ బీజేపీని టార్గెట్ చేయడం మానలేదు. ఛాతీ నొప్పితో బాధపడ్డ ఆయనను నిన్న ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్పించారు. ఆ తర్వాత కొన్ని పరీక్షల అనంతరం వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ప్రస్తుతం ఆసుపత్రిలోనే విశ్రాంతి తీసుకుంటున్న ఆయన... బీజేపీపై తన దాడిని మాత్రం ఆపలేదు.

'అలలను చూసి భయపడే పడవ ఎప్పటికీ వాటిని దాటలేదు... ధైర్యంతో ముందుకెళ్లేవాడు ఎన్నటికీ ఓడిపోడు' అంటూ బీజేపీని ఉద్దేశిస్తూ సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు. ప్రముఖ సినీ నటుడు అమితాబ్ బచ్చన్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ కవితల్లో ఉన్న ఈ వాక్యాలను ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రస్తుతం సంజయ్ రౌత్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన సోదరుడు తెలిపారు.

మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ, శివసేనలను గవర్నర్ ఆహ్వానించినా వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. తమకు సరైనంత సంఖ్యాబలం లేని నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమని బీజేపీ తెలిపింది. ఎన్సీపీ, కాంగ్రెస్ ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన యత్నించినప్పటికీ... కాంగ్రెస్ నుంచి ఎలాంటి ప్రకటన వెలువకపోవడంతో ఆ పార్టీకి నిరాశ ఎదురైంది.

 ఈ నేపథ్యంలో మూడో పెద్ద పార్టీగా అవతరించిన ఎన్సీపీకి గవర్నర్ ఛాన్స్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఈ రాత్రి 8.30 వరకు ఎన్సీపీకి అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో, కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పక్షంలో రాష్ట్రపతి పాలనకు గవర్నర్ సిఫారసు చేసే అవకాశం ఉంది.
Tue, Nov 12, 2019, 11:25 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View