శివనామ స్మరణతో మార్మోగుతున్న శివాలయాలు.. ఆలయాలకు పోటెత్తుతున్న భక్తులు
Advertisement
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఉన్న శివాలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని పూజలు చేస్తున్నారు. దీంతో భక్తులతో ఆలయాలు కిక్కిరిసిపోతున్నాయి. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయాల వద్ద ఏర్పాట్లు చేశారు. ఇక, అయోధ్యలో కోలాటాలతో కార్తీక పౌర్ణమి వేడుకలు ప్రారంభమ్యాయి.

పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తుల కోసం తిరుపతి కపిలతీర్థం శ్రీ కపిలేశ్వరస్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా ఏర్పాట్లు చేసింది. భారీగా తరలి వస్తున్న భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామి వారిని దర్శించుకుంటున్నారు. పశ్చిమగోదావరి జిల్లా వశిష్ఠ గోదావరి తీరంలోనూ భక్తుల రద్దీ నెలకొంది.

నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం దుర్గాలక్ష్మణేశ్వర స్వామికి పంచామృత అభిషేకాలు నిర్వహిస్తున్నారు. కపిల మల్లేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇక, భద్రాచలంలోని గోదావరి తీరం ఈ తెల్లవారుజాము నుంచే భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజామున మూడు గంటల నుంచే నది వద్దకు చేరుకున్న భక్తులు స్నానమాచరించి అరటి దొప్పల్లో దీపాలు వదులుతున్నారు.

ఇక, తెలంగాణలో సుప్రసిద్ధ శైవ క్షేత్రాలైన రామప్ప, హన్మకొండలోని వేయి స్తంభాల ఆలయం, సిద్దేశ్వర ఆలయం, వరంగల్‌లోని కాశీవిశ్వేశ్వర రంగనాథ ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. వేయిస్తంభాల ఆలయంలో కొలువైన రుద్రేశ్వరస్వామికి భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేశారు.
Tue, Nov 12, 2019, 08:13 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View