ఒక్క ఫొటో ఆ చిన్నారి జీవితాన్ని మార్చేసింది!
Advertisement
ఇటీవల సోషల్ మీడియాలో ఓ చిన్నారి ఖాళీ గిన్నె పట్టుకుని అతి దీనంగా ఓ క్లాస్ రూమ్ బయట నిలుచున్న ఫొటో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో... క్లాస్ రూమ్ లో తన ఈడు పిల్లలందరూ యూనిఫాం ధరించి చదువుకుంటూ ఉండగా, వారికి మధ్యాహ్న భోజనం పెట్టే వేళ తనకు కూడా ఇన్ని మెతుకులు వేయకపోతారా అని అత్యంత దయనీయ స్థితిలో ఆ బాలిక వేచిచూస్తుండడం చాలామందిని కలచివేసింది. ఇది ఓ జర్నలిస్ట్ తీసిన ఫొటో.

'ఆకలి చూపు' అనే టైటిల్ తో వచ్చిన ఈ ఫోటో చూసి వెంకట్ రెడ్డి అనే సామాజిక కార్యకర్త చలించిపోయారు. వెంటనే ఆ బాలిక అడ్రస్ కనుక్కుని వెళ్లి అక్కడి వాస్తవ పరిస్థితిని తెలుసుకున్నారు. ఆ బాలిక పేరు మోతీ దివ్య. హైదరాబాద్ శివారు ప్రాంతంలోని ఓ మురికివాడలో ఉండే ఆ బాలిక తల్లిదండ్రులు చెత్త ఏరుకుని బతికే  నిరుపేదలు. తల్లిదండ్రులు చెత్త ఏరుకోవడానికి వెళితే, ప్రతిరోజూ ఈ చిన్నారి స్కూలు వద్దకు వెళ్లి మధ్యాహ్న భోజనం కోసం అలమటించిపోయేది.

ఈ విషయం తెలుసుకున్న వెంకట్ రెడ్డి ఆమె తల్లిదండ్రులను ఒప్పించి తాను ఏ స్కూల్ వద్దనైతే భోజనం కోసం పడిగాపులు పడేదో అదే స్కూల్లో చేర్పించారు. ఇప్పుడు మోతి దివ్య అందరు విద్యార్ధుల్లా చక్కగా యూనిఫాం వేసుకుని స్కూల్ కు వెళుతోంది. దివ్యను చూడాలనుకుంటే గుడి మల్కాపూర్ లో ఉన్న దేవల్ ఝామ్ సింగ్ గవర్నమెంట్ హైస్కూల్ కు వెళితే సరి. అక్కడ అందరు పిల్లల్లా ఎంతో ఉత్సాహంగా, నవ్వుతూ, తుళ్లుతూ, హాయిగా చదువుకుంటూ కనిపిస్తుంది.
Mon, Nov 11, 2019, 06:51 PM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View