ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిపై హైకోర్టుకు నివేదిక అందజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
Advertisement
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై  హైకోర్టులో విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో సంస్థ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్రప్రభుత్వం తాజాగా నివేదిక సమర్పించింది. కోర్టు సూచించిన రీతిలో నాలుగు డిమాండ్ల పరిష్కారానికి రూ.47కోట్లు ఆర్టీసీకి చెల్లించినప్పటికీ సమస్య పరిష్కారం కాదని తెలిపింది. ఆర్టీసీకి చెల్లింపులు, రుణాలు, నష్టాలను పూడ్చడానికి రూ.2,209 కోట్లు అవసరమన్న ప్రభుత్వం రూ.47 కోట్లు ఏమూలకు సరిపోవని నివేదికలో పేర్కొంది. కార్మికులు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని భీష్మించుకుని కూర్చుంటే చర్చలు సాధ్యం కాకపోవచ్చని ప్రభుత్వం తెలిపింది.

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై మంత్రివర్గ నిర్ణయాన్ని కూడా కోర్టుకు వెల్లడించింది. మరోవైపు హైకోర్టు తన విచారణలో సమ్మె, రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్ లను కలిపి విచారణ జరుపుతామని పేర్కొంది. సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవులు పొడిగించడాన్ని సవాల్ చేస్తూ.. దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తయిందని కోర్టు ప్రకటించింది. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించే అధికార పరిధి హైకోర్టుకు ఉందన్న పిటిషనర్ తన వాదనను నిరూపించుకోవాలని ఆదేశించింది. ఆర్టీసీ ఎస్మా(అత్యవసర సర్వీసులు) పరిధిలోకి వస్తుందని పిటిషనర్ పేర్కొనగా,  పబ్లిక్ యుటిలిటీ సర్వీసులన్నీ ఎస్మా కిందికి రావని కోర్టు తెలిపింది. ఆర్టీసీ సేవలను ఎస్మా పరిధిలోకి తెస్తూ.. జీవో జారీచేస్తేనే అవి అత్యవసర సర్వీసులుగా ఉంటాయని హైకోర్టు తెలిపింది.
Mon, Nov 11, 2019, 04:21 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View