ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నేతల ఇళ్ల ముట్టడిలో ఉద్రిక్తత
తెలంగాణలో ఆర్టీసీ సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆర్టీసీ జేఏసీ నేతలు విమర్శించారు. ఇటీవల చేపట్టిన చలో ట్యాంక్ బండ్ కార్యక్రమంలో ఆర్టీసీ కార్మికులపై జరిగిన పోలీసుల లాఠీ చార్జీని నిరసిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముట్టడికి ఆర్టీసీ జేఏసీ పిలుపు నిచ్చింది. దీనికి విపక్షాలు కూడా మద్దతు పలికాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు, రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఇళ్ల వద్ద ఆందోళనకు దిగారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇళ్ల ముట్టడికి ప్రయత్నించారు. మరోవైపు పోలీసులు ఆందోళనకారులను అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో తోపులాట ఏర్పడిందని తెలుస్తోంది.

ప్రభుత్వ చీఫ్ విప్  వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ బాస్కర్ ఇంటి వద్ద కార్మికులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో ఉద్రిక్తత ఏర్పడింది. కార్మికులు, విపక్షాల కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అదేవిధంగా వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యే సన్నపనేని నరేందర్ ఇంటిని కూడా ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు.

వరంగల్ జిల్లా నర్సంపేటలో కూడా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడిలో ఇదే పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఇక్కడ జరిగిన తోపులాటలో మహిళా కానిస్టేబుల్ తో పాటు, కొందరు ఆర్టీసీ కార్మికులకు గాయాలయ్యాయని సమాచారం. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఇంటివద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో కూడా ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. సిద్ధిపేటలో మంత్రి హరీశ్ రావు నివాసం వద్ద ఆర్టీసీ కార్మికులు, వామపక్షాల నాయకులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇక్కడ పోలీసులు, కార్మికుల మద్య జరిగిన తోపులాటలో ఓ మహిళా కండక్టర్ కు గాయాలయ్యాయని తెలుస్తోంది.
Mon, Nov 11, 2019, 02:59 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View