కోడలిపై లైంగిక వేధింపులు...తిరస్కరించి జైలుకు పంపిందని హత్య
Advertisement
మానవ సంబంధాలు ఎంతెలా అధఃపాతాళానికి దిగజారిపోతున్నాయో, అప్యాయతానురాగాలు ఎలా మృగ్యమైపోతున్నాయో చెప్పేందుకు ఈ ఘటన ఓ ఉదాహరణ. కూతురిలా చూసుకోవాల్సిన కోడలిని లైంగికంగా వేధించడమేకాదు, ఆమె తిరస్కరించిందన్న కక్షతో వెంటాడి, వేధించి మరీ చంపేశాడో మామ. కర్ణాటక రాష్ట్రం హాసన్‌ జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

జిల్లాలోని రాగిముద్దనహళ్లికి చెందిన అనిల్‌, వీణలు దంపతులు. అనిల్‌ తండ్రి నాగరాజు కూడా వీరితోపాటు ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం నాగరాజు భార్య చనిపోయింది. ఆ తర్వాత నాగరాజు దృష్టి కోడలిపై పడింది. కొడుకు ఇంట్లో లేనప్పుడు ఆమెను లైంగికంగా వేధించడం మొదలుపెట్డాడు.

మామ చేష్టలను ఛీదరించుకున్న వీణ కొన్నాళ్లు మౌనంగా భరించినా, అతనిలో మార్పు రాకపోవడంతో విషయాన్ని భర్త దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో అనిల్‌ తండ్రిని మందలించాడు. అయినా అతను తీరు మార్చుకోకపోవడంతో ఆ ఇంటికి దూరంగా అద్దె ఇల్లు తీసుకుని అక్కడ వేరు కాపురం పెట్టాడు.

అయినా నాగరాజు కోడలి వెంటపడి వేధించడం మానలేదు. ఆమె ఒంటరిగా ఉన్నప్పుడల్లా మానసికంగా క్షోభ పెట్టేవాడు. దీంతో భరించలేని ఆమె భర్తకు విషయం చెప్పడంతో అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నాగరాజును అరెస్టు చేసి జైలుకు పంపించారు. కోడలిపై కక్ష పెంచుకున్న నాగరాజు బెయిల్‌పై బయటకు రాగానే కత్తి తీసుకుని నేరుగా కోడలి ఇంటికి వెళ్లాడు.

ఆమె గొంతులోను, కడుపులోను బలంగా పొడిచాడు. ప్రాణ భయంతో వీణ వేసిన కేకలు విన్న భర్త అనిల్‌, స్థానికులు అక్కడికి పరుగున వెళ్లి చూడగా వీణ రక్తపు మడుగులో పడివుంది. అప్పటికే నాగరాజు పరారయ్యాడు. వీణను వెంటనే ఆసుపత్రికి తరలించగా ఆమె దారిలోనే చనిపోయింది. పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.
Mon, Nov 11, 2019, 11:29 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View