సబితా ఇంద్రారెడ్డి కార్యక్రమానికి డుమ్మా కొట్టిన అల్లుడు పట్నం మహేందర్ రెడ్డి!
Advertisement
వికారాబాద్‌ జిల్లాలో అధికార టీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు మరోసారి బహిర్గతమైంది.  విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటనలో ఉన్నవేళ, విభేదాలు పొడచూపాయి. పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమాల్లో సబిత ఉన్న వేళ, ఆమెకు వరుసకు అల్లుడైన ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన భార్య, జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి హాజరు కాలేదు. వారిద్దరి వర్గీయులంతా ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.

ఇక, సబిత తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత, మహేందర్‌రెడ్డి దంపతులు మర్యాదపూర్వకంగా కూడా ఆమెను కలవలేదని తెలుస్తోంది. దీంతో వీరి కుటుంబాల మధ్య ఇంకా విభేదాలు సమసిపోలేదని తెలుస్తోంది. ఇక మహేందర్ రెడ్డికి దగ్గరి నేతలైన మునిసిపల్ మాజీ చైర్మన్లు లక్ష్మారెడ్డి, విశ్వనాథ్‌ గౌడ్‌ లు సబితా ఇంద్రారెడ్డికి స్వాగతం పలికి, ఆపై వెళ్లిపోయారు. మహేందర్ రెడ్డిని తీవ్రంగా విభేదించే ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మాత్రం కార్యక్రమం ఆసాంతం సబితతోనే ఉన్నారు.

ఇక ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని కూడా ఆహ్వానించామని నేతలు వెల్లడించగా, తాను పార్టీ కార్యకర్తలు, తన అనుచరుల అభిప్రాయాలను గౌరవించి వెళ్లలేదని మహేందర్ రెడ్డి సమాధానం ఇవ్వడం గమనార్హం.
Mon, Nov 11, 2019, 10:25 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View