అయోధ్య తీర్పుపై అసదుద్దీన్ ఒవైసీ స్పందన
Advertisement
ఉత్తరప్రదేశ్, అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థలంపై సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పుపై ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ తీర్పు పట్ల తాను సంతృప్తి వ్యక్తం చేసే స్థితిలో లేనని అన్నారు. సుప్రీంకోర్టు నిజంగా అత్యున్నతమైనదేనని, అయితే, పొరపాటుపడనిది కాదని వ్యాఖ్యానించారు. తమకు రాజ్యాంగంపై పూర్తి నమ్మకం ఉందని, తాము తమ హక్కులపై పోరాటం చేశామని చెప్పారు. విరాళంగా తమకు ఐదు ఎకరాల భూమి అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ భూమిని తాము తిరస్కరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.

ఈ తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు అసంతృప్తిగా ఉందని ఒవైసీ తెలిపారు. తాము 5 ఎకరాల భూమి కోసం కాదు, న్యాయం కోసం పోరాటం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. రివ్యూ పిటిషన్ వేయాలా? అనే విషయాన్ని పర్సనల్ లా బోర్డు నిర్ణయిస్తుందని అన్నారు. తీర్పుపై ముస్లిం పర్సనల్ లా బోర్డు ప్రకటనను సమర్థిస్తున్నానని తెలిపారు.

కాగా,  అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చి, ఆ స్థలం స్వాధీనం చేసుకునేందుకు 3 నెలల్లో 'అయోధ్య ట్రస్ట్'ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఇక ముస్లింలకు అయోధ్యలో 5 ఎకరాల స్థలం ఇవ్వాలని కోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే.
Sat, Nov 09, 2019, 02:22 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View