బ్యాచిలర్సే టార్గెట్.. మాయమాటలతో పడేసి, మోసం చేసే మహిళా లాయర్ అరెస్ట్
Advertisement
మాయమాటలతో పెళ్లికాని యువకులకు వలవేసి నిండా ముంచేస్తున్న ఓ యువతిని హైదరాబాద్ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. పోలీసుల కథనం ప్రకారం.. మలక్‌పేటకు చెందిన షాదాన్‌ సుల్తానా ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసి న్యాయవాదిగా పనిచేస్తోంది. 2015లో ఆమెకు  అబిడ్స్‌లోని మైనారిటీ  సంక్షేమ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ రికార్డు అసిస్టెంట్‌ రహీంతో పరిచయం ఏర్పడింది. అదికాస్తా కలిసి తిరిగే వరకు వెళ్లింది. ఈ క్రమంలో తమ మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని బయటపెడతానని రహీంను బెదిరించిన ఆమె అతడి నుంచి పలుమార్లు డబ్బులు వసూలు చేసింది.

ఆరు నెలల క్రితం రహీంను బెదిరించి రూ.3 లక్షలు వసూలు చేసిన సుల్తానా.. తాజాగా మరో రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇవ్వకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. ఆమె బెదిరింపులతో తీవ్ర మనస్తాపానికి గురైన రహీం గత నెల 19న తన కార్యాలయ సమీపంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ క్రమంలో పోలీసులకు అతడిచ్చిన ఫిర్యాదు మేరకు సుల్తానాపై కేసు నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు.

పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి. ఆమె చేతిలో మోసపోయిన వారి జాబితా చాంతాడంత ఉంది. 2014 నుంచే ఇటువంటి మోసాలకు ఆమె పాల్పడుతోంది. ప్రేమ పేరుతో గతేడాది ఏకంగా 14 మందిని మోసం చేసినట్టు తెలిసి పోలీసులే విస్తుపోయారు. అంతేకాదు, మోసపోయిన వారి జాబితాలో ఓ యువ లాయర్ కూడా ఉన్నట్టు తేలింది.
Sat, Nov 09, 2019, 09:52 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View