సిద్ధిపేటలో వారం రోజుల్లోనే ఇల్లు నిర్మించిన ఒజాజ్ సంస్థ.. రోబోటిక్ త్రీడీ సాంకేతికత అద్భుతం!
Advertisement
రోబోటిక్ త్రీడీ టెక్నాలజీని ఉపయోగిస్తూ, వారం రోజుల్లోనే ఇల్లు కట్టేసింది ఒజాజ్ అనే సంస్థ. సిద్ధిపేట జిల్లా ములుగు మండలం బండమైలారంలో వంద చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఇంటిని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ సీఈవో జాషువా మాట్లాడారు. ప్రస్తుతం తమ వద్ద ఉన్న సాంకేతికతతో 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో వారం రోజుల్లో ఇంటిని నిర్మించి ఇవ్వగలమని తెలిపారు. రష్యా నిపుణుల సహకారంతో త్రీడీ రోబోటిక్ టెక్నాలజీతో ఇది సాధ్యమన్నారు.

వచ్చే ఏడాది మార్చినాటికి ఈ సాంకేతికతను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఇంటి నిర్మాణంలో సిమెంటుతోపాటు భవన నిర్మాణ సమయంలో వచ్చే వ్యర్థాలు, ఇతర పదార్థాలను కూడా కలిపి తయారుచేసిన మిశ్రమాన్ని నిర్మాణాల్లో వాడతామని ఆయన వివరించారు. ఇంటి పైకప్పును ప్రీకాస్టింగ్ చేస్తామన్నారు. సంప్రదాయ పద్ధతిలో నిర్మించిన ఇళ్లతో పోలిస్తే ఇవి చాలా దృఢంగా ఉండడమే కాక నిర్మాణ వ్యయం 20 శాతం తగ్గుతుందని జాషువా తెలిపారు.
Sat, Nov 09, 2019, 08:46 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View