యజమానురాలి ఐడియా.. పనిమనిషి జీవితాన్ని మార్చేసింది!
Advertisement
పని కోల్పోయిన ఓ మహిళ దిగాలుగా ఉంటే చూసిన ఓ యజమానురాలు.. తనకొచ్చిన చిన్నపాటి ఆలోచనను అమలు చేసి ఔరా అనిపించుకుంది. ఇప్పుడు వీరిద్దరి విజయగాధ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇంతకీ ఏమైందంటే.. పూణేకు చెందిన ధనశ్రీ షిండే బ్రాండింగ్, మార్కెటింగ్ రంగంలో సీనియర్ మేనేజర్. ఆమె ఇంట్లో గీతా కాలె అనే మహిళ పనిచేస్తోంది. ఓ రోజు ఆఫీసు నుంచి ఇంటికొచ్చిన ధనశ్రీ.. గీత దిగాలుగా ఉండడం చూసి విషయం ఆరా తీసింది.

ఓ యజమాని తనను పని నుంచి తీసేశారని, ఈ కారణంగా తన ఆదాయం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె చెప్పింది విన్న తర్వాత ధనశ్రీలో చటుక్కున ఓ ఆలోచన మెరిసింది. వెంటనే గీత కోసం ఓ బిజినెస్ కార్డు తయారుచేసింది. ‘గీతా కాలె, ఇంటిపని సహాయకురాలు, బావ్దాన్’ పేరుతో వంద కార్డులు ప్రింట్ చేయించింది. అందులో గీత చేసే ఒక్కో పనికి ఎంతమొత్తం తీసుకుంటుందన్న విషయాలను కూడా ముద్రించింది. ఆ కార్డులను ఓ వ్యక్తి సాయంతో తమ కాలనీలో అందరికీ పంపిణీ చేయించింది.

అస్మితా జవదేకర్ అనే మహిళ ఈ కార్డు చూసి ధనశ్రీ ఆలోచనకు ముచ్చటపడింది. వెంటనే తన ఫేస్‌బుక్‌లో ఆమె కార్డును పోస్టు చేసింది. అంతే.. క్షణాల్లోనే అది వైరల్ అయింది. తాము పని ఇస్తామంటూ వందలాదిమంది గీతకు ఫోన్ చేస్తున్నారు. దేశం నలుమూలల నుంచి గీతకు ఫోన్లు వస్తుండడం విశేషం.
Sat, Nov 09, 2019, 08:32 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View